కన్న పేగును తనే తుంచేసుకుంది

కన్న పేగును తనే తుంచేసుకుంది

బెంగళూరు: పుట్టినప్పటి నుంచి ఆలనా పాలనా చూసింది. కంటికి రెప్పలా కాపాడుకుంది. ఏమైందో తెలియదు కన్న పేగును తనే తుంచేసుకుంది. నాలుగేండ్ల కూతురును నాలుగు అంతస్తుల పైనుంచి కిందికి విసిరేసింది ఆ తల్లి. ఈ దారుణ ఘటన నార్త్‌‌‌‌ బెంగళూరులోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఓ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో గురువారం జరిగింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారిని తీసుకొని ఆ తల్లి మొదట బాల్కనీలోకి వచ్చింది. కాసేపు అక్కడే పాపను తిప్పి, అటుఇటూ ఎవరన్నా ఉన్నారా అని చూసి పాపను ఎత్తుకుంది. తర్వాత రెయిలింగ్‌‌‌‌పై కూర్చొబెట్టి, ఆపై కిందకి విసిరేసింది. ఆ వెంటనే తను కూడా రెయిలింగ్‌‌‌‌పైకెక్కి కేకలు వేసింది. అది విని బయటకు వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను పట్టుకొని కిందకి దించారు. నాలుగో ప్లోర్​ నుంచి కిందపడ్డ ఆ చిన్నారి మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. కాగా, పాప పుట్టడమే అవకరంతో పుట్టిందని, వినికిడి లోపం, మాట్లాడలేకపోవడం వల్లే ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు భార్యను అరెస్ట్‌‌‌‌ చేసినట్లు తెలిపారు. పాప తల్లి డెంటిస్ట్‌‌‌‌ కాగా, తండ్రి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తల్లి మానసిక ఆరోగ్యంపై కూడా అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.