ఎట్టకేలకు బెంగళూరులో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. 3.3 కి.మీ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్.. రాగిగుడ్డ నుండి సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB) వరకు పసుపు రేఖ (RV రోడ్ -బొమ్మసంద్ర) మీదుగా విస్తరించి ఉంది. ఇది దక్షిణ బెంగళూరు , వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఐటీ హబ్‌లను కలుపుతుంది. ఈ ఫ్లై ఓవర్ ను.. భూమి నుంచి 8 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మెట్రో రైల్ ఫ్లై ఓవర్ పైన మరో 8 మీటర్లు నిర్మించబడింది. ఇది మొత్తం 16 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ అక్టోబర్ 2021 లో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమైంది.
ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ఎలక్ట్రానిక్స్ సిటీ, హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్, బిటిఎమ్ లేఅవుట్‌లకు నేరుగా కనెక్టివిటీ ఉంది. ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలు రాగిగుడ్డ నుంచి CSB వరకు ఒక వైపుకు పరిమితం చేయబడతాయి. ఫ్లై ఓవర్ అనేది ఒక వినూత్నమైన రోడ్-కమ్- మెట్రో నిర్మాణం, ఇది సిగ్నల్ రహిత కారిడార్ . అంటే రాగిగుడ్డ నుంచి వచ్చే వాహనాలు సిగ్నల్ లేకుండా సీఎస్‌బీ దాటి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, హోసూరు రోడ్డు వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని వల్ల ట్రాఫిక్ తగ్గడమే కాకుండా త్వరగా గమ్య స్థానాలకు వెళ్తారు.
మరో వైపు బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటిగా పేరుగాంచిన CSB జంక్షన్‌లో ఐదు లూప్‌లు, ర్యాంప్‌లు నిర్మించబడుతున్నాయి, A, B , C ర్యాంప్‌లు జూన్‌లో పూర్తవుతాయి ..D , E ర్యాంప్‌లు జూన్ 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.