విశ్వభారతీ వర్సిటీ స్థల వివాదానికి రాజకీయ రంగు

విశ్వభారతీ వర్సిటీ స్థల వివాదానికి రాజకీయ రంగు

పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీ, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్ మధ్య భూవివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు డాక్యుమెంట్స్ను సీఎం మమతా బెనర్జీ అమర్త్యసేన్‌కు అందించగా.. తాజాగా సీఎంను విమర్శిస్తూ యూనివర్సిటీ ప్రకటన రిలీజ్ చేసింది. సీఎం ఆశీస్సులు లేకపోవడం వల్ల తాము బాగున్నామని యూనివర్సిటీ వ్యాఖ్యానించింది. తాము ప్రధాని మోడీ మార్గదర్శనంలో ముందుకు సాగుతున్నామని, మమత మాటలు వినడం మానేసి.. మెదడును ఉపయోగించి నిజానిజాలు తెలసుకోవాలని చెప్పింది. 

విశ్వవిద్యాలయంలో ఆక్రమించిన భూమిని తక్షణమే అప్పజెప్పాలని అమర్త్య సేన్‌కు విశ్వభారతి వర్సిటీ నుంచి ఇటీవల వరుసగా లేఖలు పంపింది. ఈ లేఖలకు ఆయన స్పందిస్తూ.. నిజం ఏంటో, అబద్ధం ఏంటో గ్రహించలేని వ్యక్తి వైస్‌ ఛాన్సలర్‌ బాధ్యతల్లో ఉండటం బాధాకరమని అన్నారు. మీ వైఖరి వెనక ఉన్న రాజకీయ ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని అన్నారు. ఈ క్రమంలో భూ యాజమాన్య హక్కు పత్రాలను సేన్‌కు అందజేసిన మమత బెనర్జీ ఇకపై ఈ విషయంలో ఆయనను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఆ భూమిని అమర్త్యసేన్ తండ్రి అశుతోష్ సేన్‌ ఇచ్చారని, యూనివర్సిటీ ఆరోపించినట్లుగా ఎలాంటి కబ్జా జరగలేదని అన్నారు. విశ్వభారతిని కాషాయీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు చెప్పారు.