-
నయీంనగర్ బ్రిడ్జి క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్ల గొడవ
-
ప్రెస్‌మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
-
అదే ప్లేస్‌లో సమావేశం ప్రకటించిన మేయర్ గుండు సుధారాణి
-
ప్లేస్ ఖాళీ చేయని గులాబీ లీడర్లు
-
ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం, తోపులాట
వరంగల్, వెలుగు : హనుమకొండలోని నయీంనగర్ బ్రిడ్జి క్రెడిట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్లు సవాళ్లు, ప్రెస్‌మీట్లకు దిగడంతో సోమవారం హనుమకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు నయీంనగర్ బ్రిడ్జి వద్ద ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రకటించారు. దీనికి కౌంటర్‌గా మధ్యాహ్నం 12 గంటలకు తాము సైతం ప్రెట్‌మీట్ నిర్వహిస్తామని మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు చెప్పారు. ఇరు పార్టీల లీడర్లు ఒకేసారి నయీంనగర్ బ్రిడ్జి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోటాపోటీగా ప్రెస్‌మీట్లు
వినయ్‌భాస్కర్ ఉదయం 11 గంటలకు నయీంనగర్ బ్రిడ్జి వద్ద ప్రెస్‌మీట్ నిర్వహించారు. 11.20 గంటలకు ప్రెస్‌మీట్ ముగిసినప్పటికీ అక్కడి నుంచి వెళ్లకుండా బ్రిడ్జిని పరిశీలిస్తూ, మరోసారి మీడియాతో మాట్లాడుతూ వినయ్‌భాస్కర్‌తో పాటు, బీఆర్‌ఎస్ లీడర్లు అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించేందుకు మేయర్ సుధారాణి, కాంగ్రెస్ కార్పొరేటర్లు అక్కడికి వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులు బీఆర్‌ఎస్ లీడర్లకు చెప్పారు. అయినా వినయ్ భాస్కర్ మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా 12.30 అయినా కేడర్‌తో కలిసి అక్కడే ఉన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది. బీఆర్‌ఎస్ లీడర్లు కావాలనే అక్కడి నుంచి వెళ్లడం లేదంటూ కాంగ్రెస్ లీడర్లు ‘బీఆర్‌ఎస్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ లీడర్లు సైతం కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై విమర్శలకు దిగారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం అదుపుతప్పింది. రెండు పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు తోసుకున్నారు. పార్కింగ్ చేసిన బైక్‌లను కింద పడేశారు. సుమారు గంట పాటు పోటాపోటీగా గొడవకు దిగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర
ఇబ్బందులు పడ్డారు.
రోడ్డుపై బైఠాయించిన బీఆర్‌ఎస్ లీడర్లు
కాంగ్రెస్ లీడర్ల కావాలనే తమపై దాడికి దిగారంటూ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అతడిని పోలీస్ వ్యాన్‌లో తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు వినయ్‌భాస్కర్‌తో పాటు అతడి అనుచరులను అక్కడి నుంచి తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత మేయర్ సుధారాణి, కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాము ప్రెస్‌మీట్ పెడుతున్నామని ముందస్తుగానే సమాచారం ఇచ్చినప్పటికీ బీఆర్‌ఎస్ లీడర్లు కావాలనే గొడవ చేస్తున్నారని మండిపడ్డారు.