భద్రాద్రి ఆలయ ఈవోపై దాడి పట్ల ఉద్యోగ సంఘాల నిరసన

భద్రాద్రి ఆలయ ఈవోపై దాడి పట్ల ఉద్యోగ సంఘాల నిరసన

భద్రాచలం, వెలుగు :  పురుషోత్తపట్నం భూముల ఆక్రమణదారులు దేవస్థానం ఈవో రమాదేవిపై దాడి చేయడంపై బుధవారం భద్రాచలంలో ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. టీఎజ్జీవోస్​ డివిజన్​ శాఖ, భద్రాద్రి దేవస్థానం ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమసంఘాలు, వివిధ దేవస్థానాల వైదిక పరిపాలన సిబ్బంది ఆధ్వర్యంలో తానీషా కల్యాణమండపం వద్ద నిరసన కార్యక్రమం చేసి నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

భద్రాద్రి రామయ్య భూమిని అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్​ రాష్ట్ర ప్రచార ప్రముఖ్​ పగుడాకుల బాలస్వామి హెచ్చరించారు. రాముడిపై భక్తితో ఓ దాత 889.50 ఎకరాలు విరాళంగా ఇస్తే బరితెగించి ఆక్రమించుకోవడం దారుణమన్నారు. ఈవోపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. 

దాడి హేయమైన చర్య.. 

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక తీర్మానం చేసుకుని ముందుకు వచ్చి రామయ్య భూములను రక్షించాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్​రెడ్డి కోరారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషోత్తపట్నంలోని ఆక్రమణదారులు ఈవో రమాదేవిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 
పాల్వంచ : భద్రాద్రి ఆలయ ఈవోపై దాడి పట్ల పెద్దమ్మ తల్లి ఆలయ సిబ్బంది, కమిటీ నిరసన తెలిపారు. 

విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారి పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వర రావు, సభ్యులు  పాల్గొన్నారు.