హాట్సాఫ్ అరుణ.. కాటికాపరిగా పనిచేస్తూ.. 12 మందికి ఆశ్రయమిస్తూ..

హాట్సాఫ్ అరుణ.. కాటికాపరిగా పనిచేస్తూ.. 12 మందికి ఆశ్రయమిస్తూ..

నా దేవాలయం శ్మశానవాటికే

ఊపిరి ఆగాక అందరూ ఆడికే పోవాలి. కానీ, ఆ స్థలమే ఆమెకు కూడు పెడుతోంది. చితిని చూస్తే భయపడతాం. కానీ, అదే ఆమె బతుకులో వెలుగు నింపుతోంది. కాటికాపరిగా కేవలం మగవాళ్లే ఉంటారన్న భ్రమను పోగొడుతుంది భద్రాచలానికి చెందిన అరుణ. 19 ఏండ్లుగా కాటికాపరిగా పనిచేస్తోంది. తన పిల్లలతో పాటు మరికొంతమంది అనాథలను చేరదీసి పోషిస్తోంది. 

స్మశానం అనగానే గుండె ఝల్లుమంటుంది. చితి మంటలు చూస్తే ఒకలాంటి భయం వచ్చి చేరుతుంది. అలాంటిది భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణ 19 ఏండ్లుగా కాటికాపరిగా పనిచేస్తోంది. ఆడవాళ్లు కాటికాపరిగా ఉండకూడదని చాలామంది చెప్పినా బతుకుదెరువు కోసం ఆ పనిచేస్తోంది. ముత్యాల అరుణ భర్త రాజమండ్రి శ్రీనివాసరావు భద్రాచలంలోని శ్మశాన వాటికలో పనిచేసేవాడు. దీంతో అరుణ కూడా శ్మశానవాటికలోనే ఉంటూ పనిచేసుకునేది. తన భర్త తాగి పడిపోయినప్పుడు రాత్రి పూట వచ్చే శవాలను ఆమే కాల్చేది. అలా అరుణకు ఆ పని అలవాటయ్యింది. 2017లో శ్రీనివాస్‌‌ చనిపోవడంతో ఆమె కాటికాపరిగా మారి వచ్చే డబ్బులతో పిల్లల్ని పోషిస్తోంది. వాళ్లతో పాటే మరో 12 మంది అనాథలను చేరదీసి వారికీ అన్నం పెడుతోంది. పంచాయతీ నుంచి 7,800 రూపాయలు జీతం ఇస్తున్నారు. శవం కాలిస్తే వచ్చే దక్షిణతోనే వాళ్లందర్నీ చూసుకుంటోంది. కరోనా టైంలో కూడా కాటికాపరిగా పనిచేసింది ఆమె. తమ కుటుంబసభ్యులు చనిపోయినా సరే, కొంతమంది అస్సలు పట్టించుకోరు. శ్శశానంలో వదిలేసి పోతారు. అందరూ ఉన్నా అనాథ శవాలుగా మారిన వాటికి ఆమే అంత్యక్రియలు చేసింది. అలా మూడు నెలల్లో 12 మందికి అరుణనే అంత్యక్రియలు చేసింది. “ కరోనా టైంలో కొందరైతే కనీసం శవం పట్టుకోవడానికి రాలేదు. తండ్రికి తలకొరివి పెట్టేటప్పుడు తగువులాడుకునే కొడుకుల్ని చాలామందిని చూశాను’’ అంటోంది.

అత్యాశ ఉండదు..

“ నేను పనిచేసే శ్మశానవాటికే నాకు దేవాలయం. అందుకే ఇక్కడే ఉంటూ పరిసరాలను శుభ్రం చేస్తాను. పిచ్చి మొక్కలు తొలగించి నీటుగా పెడతాను. శవాన్ని కాల్చేందుకు కర్రలు పేర్చి, అది పూర్తిగా కాలిపోయేవరకు ఇక్కడే ఉంటాను. శవాన్ని కాల్చేటప్పుడు ఒక్కోసారి నిప్పు కణికలు మీద పడేవి. ఒక్కోసారి కాలుతున్న శవం అమాంతం ఎగిరిపడుతుంది. అయినా కూడా ఇబ్బంది పడకుండా పని పూర్తి చేస్తాను. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ కూడా అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది. ఈ 19 ఏళ్లలో రోజుకో శవమైనా చూస్తున్నా. చిన్నవయసులో ఎవరైనా చనిపోతే చాలా బాధగా అనిపించేది. ఆ రోజంతా మనసు చాలా బాధగా అనిపిస్తుంది. అందరిలా నాకు కూడా శ్మశానం అంటే చాలా భయం. కానీ, ఇప్పుడు అదే బతుకు దెరువుగా మారింది. ఇక్కడ పనిచేసేవాళ్లకి అత్యాశపోతుంది. అందరూ పోయేవాళ్లే కదా అనే విషయం అర్థమవుతుంది. నా ఇద్దరు పిల్లలతో పాటు మరో 12 మంది అనాథలకు ఆశ్రయమిచ్చా. ఐదు నెలల పాపను పెంచుకుని, పెద్ద చేసి  పెండ్లి చేశాను. నా దగ్గర ఉండే అనాథలకు ఆధార్‍, రేషన్‍కార్డులు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని ఆఫీసర్లను వేడుకుంటున్నా” అంటోంది అరుణ.