రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

రాములోరి కల్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈ నెల 10 న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. ఏప్రిల్ 16 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

భద్రాచలం సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏప్రిల్ 16 వరకు జరిగే  బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. దక్షిణ అయోద్యగా పేరుగాంచిన భద్రాచలంలో నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సరం ఉగాది రోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 10 రాములోరి కళ్యాణానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

శుభకృత్ నామ సంవత్సరం ఉగాది రోజు పంచాంగ శ్రవణం, తిరువీధి సేవతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 16 న చక్రతీర్ధం, పూర్ణాహుతి, ధ్వజారోహణం,పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 6 వ తేదీ ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, అంకురార్పణ, 7 న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గారుడాదివాసం, 8 న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 9 న ఎదుర్కోలు ఉత్సవం, 10 న శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం,11 న రామయ్య మహాపట్టాభిషేకం జరగనున్నాయి.


బ్రహ్మోత్సవాల కారణంగా ఏప్రిల్ 2 నుంచి 16 వరకు నిత్యకళ్యాణాలు,6 నుండి 16 వరకు దర్బార్ సేవలు,6 నుండి 23 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అధికారులు. రాములోరి తలంబ్రాలతో పాటు లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డులు సిద్ధం చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు,లడ్డులకు 30 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

 కరోనాతో గత రెండేళ్లుగా భక్తులను కల్యాణానికి అనుమతించలేదు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. కల్యాణోత్సవం జరిగే మిథిలా స్టేడియంను సర్వoగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కోటి రూపాయల వ్యయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. సీతారాముల కల్యాణానికి మిథిలా స్టేడియంను చలువ పందిళ్లు, రంగు రంగుల షామియానాలతో ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు తాత్కాలిక టాయిలెట్స్, మంచి నీటి ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం, రెవెన్యూ అధికారులు.