పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. పీఎస్లో మహిళ ఆత్మహత్యాయత్నం..

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. పీఎస్లో మహిళ ఆత్మహత్యాయత్నం..

తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పురుగుమందు తాగి ఓ గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

ఇద్దరి మహిళల మధ్య చెలరేగిన గొడవ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దీంతో సమ్మక్క అనే మహిళపై నాగమణి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సమ్మక్క కొడుకు సిద్ధార్థ(16)పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలో సమ్మక్కను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ఆమెను విచారించారు. అయితే నాగమణిని కొట్టిన మాట వాస్తవమేనని సమ్మక్క పోలీసులకు చెప్పింది. 

కానీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అభం.. శుభం తెలియని తన కుమారుడు సిద్ధార్థపై కేసు నమోదు చేయడంతో.. సమ్మక్క మనస్థాపానికి గురైంది. దీంతో పోలీస్ స్టేషన్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది సమ్మక్కను హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తలించారు. సమ్మక్కకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.