V6 News

దొంగ ఓట్లు వేయకుండా చూడాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

దొంగ ఓట్లు వేయకుండా చూడాలి :  కలెక్టర్ జితేశ్ వి పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​
  • సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్​ కాస్టింగ్​
  • పోలింగ్​, కౌంటింగ్​ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 

ఎస్పీ రోహిత్​ రాజుభద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా అధికారులు అలర్ట్​గా ఉండాలని  కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​ పేర్కొన్నారు. ఎస్పీ బి. రోహిత్​ రాజు, అబ్జర్వర్లు సర్వేశ్వర్​రెడ్డి, లావణ్యతో కలిసి రెండో విడత ఎన్నికలపై  ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్​ అధికారులు, ఎన్నికల సిబ్బందితో కలెక్టరేట్​ నుంచి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. పోలింగ్​ కేంద్రాల్లో రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఓటర్​ రిజిస్టర్​ను కచ్చితంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​ తప్పని సరిగా ఉండాలన్నారు. వీడియో కెమెరాలు బ్యాలెట్​ బాక్సులను నిరంతరం పర్యవేక్షించేలా అమర్చాలని చెప్పారు. 

కౌంటింగ్​ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. రెండు వేలకు పైగా ఓటర్లున్న జగన్నాథపురం, నరసాపురం, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. కౌంటింగ్​ హాళ్లలో అవసరమైన టేబుల్స్​ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ ఉంటుందని తెలిపారు. ఫలితాల అనంతరం ఎటువంటి ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని చెప్పారు. ఎస్పీ రోహిత్​ రాజు మాట్లాడుతూ రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్, కౌంటింగ్​ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీలు 
సహకరించాలన్నారు.