డ్యూటీకి రాని డాక్టర్ల జీతాలు ఆపేయండి : ప్రియాంక అల

డ్యూటీకి రాని డాక్టర్ల జీతాలు ఆపేయండి : ప్రియాంక అల
  •     భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల 
  •     జిల్లా జనరల్​ హాస్పిటల్ తనిఖీ.. డాక్టర్లతో రివ్యూ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్​ లేకుండా డ్యూటీకి రాని  డాక్టర్ల జీతాలు ఆపేయాలని ఇన్​చార్జి మెడికల్​ సూపరింటెండెంట్​ లక్ష్మణ్​రావును ఆదేశించారు. కొత్తగూడెంలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​ను కలెక్టర్​ శుక్రవారం తనిఖీ చేశారు.

పలు వార్డులను పరిశీలించారు. వైద్య సేవలు, సౌకర్యాల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బయోమెట్రిక్​ అటెండెన్స్​ నూరు శాతం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ వార్డుల్లో డాక్టర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

హాస్పిటల్​లో జరుగుతున్న డెవలప్​మెంట్​ వర్క్స్​పై ఆరా తీశారు. ఓపీ వద్ద పురుషులు, స్త్రీలకు కామన్​ టాయ్​లెట్​ ఉండడంతో ఇబ్బంది కలుగుతోందని పలువురు కలెక్టర్​ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్య, హాస్పిటల్​ పరిసరాల్లోని డ్రైనేజీ సమస్యను వివరించారు. ఆమె వెంట డీఎంహెచ్​ఓ శిరీష, ఆర్​ఎంఓ పుష్పలత, ఆర్​ఎంఓ ఎంసీహెచ్​ వీరబాబు, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ సురేందర్ పాల్గొన్నారు.