
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఆదివారం ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చాడు తమన్. ఫస్ట్ సాంగ్ త్వరలోనే రాబోతోందని ట్వీట్ చేశాడు.
దీంతో ఈ పాట కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ షూట్ జరుగుతుండగానే.. రీసెంట్‌గా ఓవర్సీస్ డీల్ పూర్తయింది. సరిగమ సినిమాస్ సంస్థ భారీ మొత్తానికి యూఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.