పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలి

పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలి

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఇవాళ(శుక్రవారం) ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. వివిధ రంగాల్లో పీవీ నరసింహారావు చేసిన కృషి తెలియజేసేలా దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. మరోవైపు నెక్లెస్‌ రోడ్డుకు పీవీ జ్ఞానమార్గ్ గా పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు.

అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో పీవీ గురించి విస్తృత చర్చ చేపట్టడంతో పాటు అసెంబ్లీలో పీవీ నరసింహారావు పొట్రేయిట్ (తైలవర్ణ చిత్రం, చిత్తరువు) పెట్టాలని నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. పార్లమెంట్‌ లో పీవీ చిత్రపటం ఏర్పాటు, హైదరాబాద్‌లో పీవీ నెలకొల్పిన కేంద్రీయ వర్సిటీకి ఆయన పేరే పెట్టాలని కేంద్రాన్ని కోరతామన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామన్నారు.

పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీనిపై త్వరలోనే ఆ రెండు గ్రామాల్లో పర్యటించి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆదేశించారు.