ప్రస్తుతం దేశంలో ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి కంపెనీలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీలో సేవలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సేవల వ్యాపారంలో ఇవి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ప్రజల నుంచి అధికంగా రేట్లు వసూలు చేయటం నుంచి డ్రైవర్లకు తక్కువ చెల్లింపు వరకు అనేక ఆరోపణలను సైతం అందుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీ కోఆపరేటివ్ సెక్టార్ తో చేతులు కలిపి ‘భారత్’ బ్రాండ్‌తో టాక్సీ సేవలను ప్రారంభిస్తోంది.
దీనిని కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ , జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి అభివృద్ధి చేశాయి. ఈ మేరకు ఈ సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌తో కేంద్రప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఇందులో భాగంగా భారత్ ట్యాక్సీ నవంబర్‌లో ఢిల్లీలో 650 మంది డ్రైవర్లతో తన పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. తరువాత డిసెంబర్ లో ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నారు. భారత్ ట్యాక్సీలో టూవీలర్,త్రీ వీలర్, ఫోర్ వీలర్స్ ఇలా అన్ని రకాల వాహనాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలు సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడవనున్నాయి.
భారత్ ట్యాక్సీ ప్రైవేట్ కంపెనీ కాకుండా సహకార సంస్థగా ఉంటుంది. అందువల్ల, డ్రైవర్లు కూడా సహ యజమానులుగా ఉంటారు. ఈ సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లకు వెళ్తాయి. భారత్ ట్యాక్సీలో నమోదు చేసుకున్న డ్రైవర్లు ఎవరికీ కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. మెంబర్ షిప్ కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో భారత్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను ఈ ఫ్లాట్ ఫామ్ లో పార్ట్ నర్ షిప్ చేయాలనుకుంటోంది.
ఈ సేవను ఎలా ఉపయోగించాలి?
భారత్ ట్యాక్సీని వాడటం ఓలా, ఉబర్ యాప్ ల మాదిరి చాలా ఈజీ.. ఆండ్రాయిడ్ కస్టమర్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత్ టాక్సీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ స్టోర్ నుంచి దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉంటుంది.
