రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మంగళవారం విడుదలైన ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన గురించి తెలియజేసేందుకు బుధవారం సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులను నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీసిన మేము ఆ టార్గెట్‌ని వంద శాతం రీచ్ అయ్యాం. ఆడియన్స్ నాన్‌స్టాప్‌గా నవ్వుతున్నారు. నా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు అని అంటారు.
ఈ సినిమాతో ఆ ఆడియన్స్ డబుల్ అయ్యారు. ఈ స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన రవితేజ గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమా టికెట్ రేట్లు కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఉంచాం. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ. 175, మల్టీప్లెక్స్ రూ.200, ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ రూ.195, మల్టీప్లెక్స్ రూ.250 ఉన్నాయి’ అని చెప్పారు.
సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్‌కు హీరోయిన్స్ థ్యాంక్స్ చెప్పారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ఈ చిత్రం సక్సెస్ మీట్ జరగడం సంతోషంగా ఉందని, ఈ సంక్రాంతి తనకు మెమొరబుల్ అని సంగీత దర్శకుడు భీమ్స్ సంతోషం వ్యక్తం చేశారు.
