కేసీఆర్ సర్కార్ మారడం ఖాయం.. అధికారులు జాగ్రత్త : భట్టి

కేసీఆర్ సర్కార్ మారడం ఖాయం.. అధికారులు జాగ్రత్త : భట్టి

డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ సర్కార్ మారడం ఖాయమని...అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఈ రెండు మూడు రోజుల్లో అడ్డగోలు వ్యవహారాలు చేయొద్దన్నారు.  

ఈ రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు  చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు భట్టి. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తంగా ఉండాలని..  ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అధికారులు చేయొద్దని సూచించారు.  కౌంటింగ్  కేంద్రాల దగ్గర అధికార పార్టీ కుట్రలు చేసే ప్రమాదం ఉందన్నారు.   ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు ఏదైనా చేస్తారని చెప్పారు భట్టి.

 కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు నమ్మారని.. ఎన్నికల్లో ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్ ను దీవించారని  చెప్పారు భట్టి విక్రమార్క.   ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందన్నారు.  ధరణితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు భట్టి.  అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ నేతలు భూ దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. ధరణిని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు ఆక్రమించారని తెలిపారు. లక్ష కోట్ల విలువైన భూములను ప్రజలకు ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.