మధిర అభివృద్ధికి పరితపిస్తూనే ఉంటా : భట్టి విక్రమార్క 

మధిర అభివృద్ధికి పరితపిస్తూనే ఉంటా : భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు : ఊపిరి ఉన్నంతవరకు మధిర నినియోజకవర్గ అభివృద్ధికి పరితపిస్తూనే ఉంటానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.  గురువారం మధిరలో సీపీఐ, టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్ వరకు తిరిగి అక్కడ నుంచి రెడ్డి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీమంత్రి, ఎన్నికల పరిశీలకులు అవినాష్ వజహర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి గార్డెన్ వద్ద జరిగిన సభలో భట్టి మాట్లాడారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చెప్పారు.

మరియమ్మ లాకప్ డెత్ న్యాయ పోరాటంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితమే దళిత బంధు పథకం వచ్చిందని తెలిపారు.  మధిర నియోజకవర్గంలో ముదిగొండ నుంచి ఎర్రుపాలెం వరకు పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలు ఎన్నో సమస్యలను తనకు తెలిపారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. అందులో వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఆరు గ్యారంటీలు తీసుకువచ్చానని వెల్లడించారు. 

 భట్టికి బీఆర్ఎస్ కౌన్సిలర్​ వీరతిలకం 

మధిర, వెలుగు : భట్టి విక్రమార్క గురువారం మధిరలో నామినేషన్​ వేసేందుకు వెళ్తున్న క్రమంలో బీఆర్​ఎస్ కు చెందిన మధిర మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్​ మల్లాది సవిత ఆయన వాహనానికి ఎదురెళ్లి వీరతిలకం దిద్దారు. భట్టి నామినేషన్​కు డిపాజిట్​ అమౌంట్​ను కూడా అందజేశారు. భట్టికి ఆనవాయితీగా ప్రతిసారి ఇస్తున్నట్లు ఈసారి కూడా డిపాజిట్ అమౌంట్ అందించినట్లు వారు తెలిపారు.  కానీ కాంగ్రెస్​ అభ్యర్థికి  బీఆర్​ఎస్​ వార్డు కౌన్సిలర్​ స్వాగతం పలకడం, డిపాజిట్​ ఎమౌంట్​ అందజేయడం ఏమిటని, ఇది బీఆర్​ఎస్​కు షాక్​ అని పలువురు చర్చించుకుంటున్నారు.