బడ్జెట్‭లో హరీష్ అంకెలగారడి తప్ప ఏమీ లేదు: భట్టి విక్రమార్క

బడ్జెట్‭లో హరీష్ అంకెలగారడి తప్ప ఏమీ లేదు: భట్టి విక్రమార్క

తెలంగాణ బడ్జెట్‭లో మంత్రి హరీష్ రావు అంకెలగారడి, మాయమాటలు తప్ప ఏమిలేవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయం వచ్చేసరికి.. హామీలతోనే కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‭లో బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదన్న భట్టి.. 8 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ఎక్కడ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సందర్భం వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ నేతలు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ, 5 గంటలు కూడా కరెంట్ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం ఒక్కటే భారీగా కనిపిస్తోందని.. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఏమైనాయని భట్టి నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల మాటే లేదని.. ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని హరీష్ రావు చదివారని భట్టి ధ్వజమెత్తారు. విద్యార్థులను గాలికి వదిలేశారన్నారు. ఇక రుణమాఫీ నిధులు ఏమయ్యాయని ప్రభుత్వం పై భట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.