వీడియో పోస్ట్ చేసి మరో నటి ఆత్మహత్య

వీడియో పోస్ట్ చేసి మరో నటి ఆత్మహత్య

సినీ రంగంలో వరుస ఆత్మహత్యలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బుధవారం రోజు హిందీ టెలివిజన్ నటుడు సమీర్ శర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. సమీర్ సబర్బన్ మలాడ్ లోని తన ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోయిన మరుసటి రోజే గురువారం భోజ్‌పురి సినీ నటి అనుపమా పాథక్ ఆత్మహత్యకు పాల్పడింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని మీరా రోడ్ ప్రాంతంలోని మదా కాలనీలోని ఆమె అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లోనే ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన పాథక్.. నటన మీద ఆసక్తితో ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. పలు భోజ్‌పురి సినిమాలు, టీవీ షోలలో నటించి ప్రేక్షకులను మెప్చించారు. పాథక్ చనిపోవడానికి ఒక రోజు ముందు ఫేస్బుక్ లో ఒక వీడియో షేర్ చేసింది. తాను మోసపోయానని.. ఎవరినీ నమ్మలేకపోతున్నానని ఆ వీడియోలో తెలిపింది. ‘బై బై, గుడ్ నైట్’ అంటూ ఆ వీడియోకు ట్యాగ్ చేసింది.

‘పాథక్ భర్త పని మీద బయటకి వెళ్లినప్పుడు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పాథక్ స్నేహితుడొకరు ఆమె ద్విచక్ర వాహనాన్ని తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె మోసపోయానని భావించింది. లాక్డౌన్ వల్ల సినిమాలు, షోలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆయన ఆత్మహత్యకు పలువురు పరోక్షంగా కారణమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన జూన్ 14న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని చనిపోయాడు. సుశాంత్ ఘటనకు వారం ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ జూన్ 9న బిల్డింగ్ మీది నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మే 15న టీవీ నటుడు మన్మీత్ గ్రెవాల్ కూడా ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు.

For More News..

కొత్త విద్యావిధానం గురించి అపోహలు, అనుమానాలు వద్దు

అభిమానులకు మహేష్ బాబు ట్వీట్

దేశంలో నిన్న రికార్డుస్థాయిలో కరోనా కేసులు