మన పోచంపల్లి.. ఎన్నో ప్రత్యేకతలు

మన పోచంపల్లి.. ఎన్నో ప్రత్యేకతలు

హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్​ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దీన్ని బెస్ట్ టూరిజం విలేజ్​గా ఎంపిక చేసినట్లు యునైటేడ్​ నేషన్స్​ వరల్డ్​ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్​డబ్ల్యూటీవో) ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్​లోని మాడ్రిడ్ లో నిర్వహించనున్న యూఎన్​డబ్ల్యూటీవో జనరల్ అసెంబ్లీలో ఈ అవార్డు అందజేయనుంది. గ్రామీణ పర్యాటకాన్ని పెంచడంతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో డబ్ల్యూటీవో ‘‘బెస్ట్ టూరిజం విలేజ్’’ కాంటెస్ట్ )నిర్వహించింది. డబ్ల్యూటీవోలో 159 సభ్య దేశాలు ఉండగా.. ఒక్కో దేశం మూడు గ్రామాల చొప్పున ప్రతిపాదనలు పంపాయి. ఇందులో భాగంగా మన దేశం మేఘాలయలోని కొంగ్ థాంగ్, మధ్యప్రదేశ్ లోని లధ్ పురాఖాస్, రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లిని ప్రతిపాదించింది. వీటిలో పోచంపల్లిని ఎంపిక చేసినట్లు డబ్ల్యూటీవో ప్రకటించింది. 


ఎన్నో ప్రత్యేకతలు.. 
పోచంపల్లి మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్యానికి ముందు పోచంపల్లి నుంచి అరబ్ దేశాలకు గాజుల ఎగుమతి జరిగేది. దీంతో అప్పట్లో గాజుల పోచంపల్లిగా గుర్తింపు పొందింది. స్వాతంత్ర్యం తర్వాత భూదానానికి బాటలు వేసి, దేశవ్యాప్తంగా భూదానోద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేయడం ద్వారా భూదాన్​ పోచంపల్లిగా పేరు పొందింది. పోచంపల్లి చేనేత దుస్తులకు పెట్టింది పేరు. అందుకే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ గ్రామం టూరిజం విలేజ్ గానూ పేరు సంపాదించింది. చుట్టూ కొండలు.. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు.. మూసీ పరవళ్లు.. పంట పొలాలు.. అర్బన్ పార్క్.. శ్రీరామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్.. చేనేత బట్టల దుకాణాలు.. షాపింగ్ కు వచ్చే జనంతో పోచంపల్లి ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. 


‘‘వోకల్ ఫర్ లోకల్’’తో సాధ్యమైంది: కిషన్ రెడ్డి  
పోచంపల్లి ప్రజలకు కేంద్ర కల్చరల్ అండ్ టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎంట్రీలను సమర్థవంతంగా పంపినందుకు సెంట్రల్ టూరిజం అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘‘వోకల్ ఫర్ లోకల్’’ నినాదంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇప్పటికే పర్యాటక మంత్రిత్వ శాఖ విలేజ్ టూరిజం పాలసీని రూపొందించిందని.. ఇది గ్రామాల్లో టూరిజాన్ని, స్థానిక కళలు, హస్త కళలకు ప్రోత్సహిస్తుందని చెప్పారు. 

రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది: మంత్రి కేటీఆర్ 
వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ భూదాన్ పోచంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి గ్రామాన్ని బెస్ట్ వరల్డ్ టూరిజం విలేజ్ గా  ఎంపిక చేయడం తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దక్కిన మరో అరుదైన గౌర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వమని మంత్రి కేటీఆర్ అన్నారు. పోచంపల్లి గ్రామ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంగళవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగంపై శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిందన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, నేతన్నలను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. చేనేతకు పేరొందిన పోచంపల్లి గ్రామానికి దక్కిన ఈ అవార్డు వల్ల అక్కడ నేసే ఇక్కత్ చీర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.