
- ఇండియాను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడమే టార్గెట్
- ఈ ఒప్పందాలతో పెట్టుబడుదారులకు రక్షణ
- వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థల తలుపు తట్టేందుకు వీలు
న్యూఢిల్లీ: ఒకవైపు యూఎస్, ఈయూ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతూనే, మరోవైపు ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడానికి 12కి పైగా దేశాలతో పెట్టుబడి ఒప్పందాలను కూడా ఇండియా కుదుర్చుకుంటోంది. సౌదీ అరేబియా, కతార్, ఇజ్రాయెల్, ఒమన్, యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్, రష్యా, ఆస్ట్రేలియాతో సహా డజనుకు పైగా దేశాలతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు (బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీస్–బిట్) కోసం చురుకుగా చర్చలు జరుపుతోందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అదనంగా తజికిస్తాన్, కంబోడియా, ఉరుగ్వే, మాల్దీవులు, కువైట్లతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ఒప్పందాలు ఇరు దేశాలలో పెట్టుబడుల రక్షణ, ప్రోత్సాహానికి సహాయపడతాయి.
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతున్న ఇండియా, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటోంది. గత బడ్జెట్‌లో బిట్ మోడల్‌ను పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా మార్చాలని నిర్ణయించింది. కిందటేడాది యూఏఈ, ఉజ్బెకిస్తాన్‌తో పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. సాధారణంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఇన్వెస్టర్లకు అందే రక్షణ, ప్రయోజనాలు, ప్రోత్సాహకాలతో పోలిస్తే బిట్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి.
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా బిట్‌లలో 5 ఏళ్లపాటు స్థానికంగా ఉన్న చట్టపరమైన పరిష్కారాలను అనుసరించాలనే నిబంధన ఉంటుంది. ఆ తర్వాతనే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లకు వెళ్లాలని ఉంటుంది. ఇది పెట్టుబడిదారులకు, సంబంధిత దేశానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టైమ్ లిమిట్‌ను 3 ఏళ్లకు తగ్గిస్తే మంచిది..
కిందటేడాది ఇండియా, యూఏఈ మధ్య కుదిరిన బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీలో ఈ వ్యవధిని 3 ఏళ్లకు తగ్గించారు. వివాదాలను పరిష్కారించడం మరింత సులభంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో కుదుర్చుకునే బిట్‌లలో కూడా ఈ కాల వ్యవధినే వాడాలని సలహా ఇస్తున్నారు.“ పెట్టుబడిదారుల విశ్వాసం, దేశ పాలసీల మధ్య సమతుల్యాన్ని కాపాడుతూ, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలగకుండా వివిధ దేశాలతో ఇండియా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది” అని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియా అంతర్జాతీయ రక్షణ ప్రమాణాలకు కట్టుబడి, స్థిరమైన పెట్టుబడి వాతావరణాన్ని అందించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.
డెలాయిట్ ఇండియా ఎకనామిస్ట్ రుమ్కీ మజుందార్ మాట్లాడుతూ, బిట్‌లు ఇండియాకు వ్యూహాత్మక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. ఈ ట్రీటీలు కేవలం చట్టపరమైన సాధనాలే కాక, ఇండియన్ కంపెనీల పోటీతత్వం పెరగడంలో సాయపడతాయని వివరించారు. ఎకనామిక్ సర్వే 2024–-25 ప్రకారం, ఏప్రిల్ 2000– -మార్చి 2025 మధ్య ఇండియా ఆకర్షించిన ఎఫ్‌డీఐలు ఒక ట్రిలియన్ డాలర్లను దాటాయి. ఇండియాను సురక్షిత పెట్టుబడి గమ్యస్థానంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 81 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందులో మారిషస్ (25శాతం), సింగపూర్ (24శాతం), యూఎస్ (10శాతం), నెదర్లాండ్స్ (7శాతం), జపాన్ (6శాతం), యూకే (5శాతం), యూఏఈ (3శాతం) నుంచి ఎక్కువగా వచ్చాయి. సర్వీసెస్, సాఫ్ట్‌వేర్, టెలికాం, ట్రేడింగ్, నిర్మాణం, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మా రంగాలు ఎక్కువగా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాయి.