
- పారిశుధ్య కార్మికులు, సిబ్బంది పని తీరు భేష్
- సమన్వయంతో ఆపరేషన్ పూర్తి చేసిన అన్ని శాఖల అధికారులు
సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ వద్ద పేలుడు ఘటన బాధితులకు సహాయక చర్యల్లో అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు నిరంతరం శ్రమించారు. గత సోమవారం ఘటన జరిగిన వెంటనే జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన 42 మంది డెడ్ బాడీలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 23 మంది క్షతగాత్రులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 61 మంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఇంకా 8 డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉంది. మొదటి రోజు మంటలను అదుపు చేస్తూ క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్ నేతృత్వంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ ఆదివారం వరకు 7 రోజులపాటు కొనసాగింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై సహాయక చర్యలు చేపట్టగా రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ, హైడ్రా, పోలీసు, ఎన్ డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం ఇతరత్రా సహాయక బృందాలు బాధితుల సహాయార్థం పనిచేశాయి. అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిరంతరాయంగా బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలిచాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నిజానిజాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది.
ఎన్నో అడ్డంకులు..
మృతుల గుర్తింపు, శిథిలాల తొలగింపు విషయంలో మొదట్లో మూడు రోజులపాటు వర్షం అడ్డంకిగా మారింది. అయినా వర్షాన్ని లెక్కచేయకుండా రెస్క్యూ టీంలు మృతదేహాలను వెలికి తీస్తూ శిథిలాలను భారీ క్రేన్ల సాయంతో తొలగించాయి. సహాయక చర్యలు చేపట్టే క్రమంలో రెస్క్యూ టీం, ఎస్ డీఆర్ఎఫ్, డీడీఆర్ఎస్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. వీరందరూ కూలిన శిథిలాల కింద ఉన్న కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు పనులు ప్రారంభించారు.
భారీ పరికరాలు, శిథిలాలను 11 క్రేన్ల ద్వారా తొలగించగా మరోపక్క బయటపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్ లలో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇదే టైంలో బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తూ పరిస్థితిని చక్కబెట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ తోపాటు ఘటన స్థలం వద్ద హెల్ప్ లైన్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. కాగా మృత దేహాలు చిద్రం కావడంతో గుర్తించడం కష్టతరమైంది. శిథిలాల క్రింద ముక్కలు, ముక్కలుగా లభ్యం అవుతుండడంతో వాటిని సేకరించేందుకు ఇబ్బందులు పడ్డారు.
శాఖల వారీగా..
రెవెన్యూ శాఖ నుంచి నాలుగు డివిజన్లకు చెందిన ఆర్డీవోలు, ఐదుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ డివిజన్ల తహసీల్దార్ లు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సహాయాన్ని అందిస్తూ వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ గాయత్రి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓలు, ఇతర మెడికల్ అధికారుల బృందం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూనే పునరావాస కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్మించారు. అలాగే ఇస్నాపూర్, తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్లు తమ బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీపీఓ సాయిబాబా, 10 మంది ఎంపీడీవోలు, ఎంపీఓలు సైతం సహాయం అందించారు. మొత్తం మీద సమష్టి కృషి వల్ల ఈ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.
పారిశుధ్య సిబ్బంది కూడా..
డెడ్ బాడీల వెలికితీతలో పారిశుధ్య సిబ్బంది సేవలు మరువలేనివి. మున్సిపల్, పంచాయతీ కార్మికులు ఈ ఆపరేషన్ లో బాగా పనిచేశారు. పేలుడు ధాటికి శిథిలాల కింద డెడ్ బాడీల అవశేషాలు విడివిడి భాగాలు లభ్యం కావడంతో వాటిని సేకరించే విషయంలో చాలా కష్టపడ్డారు. దుర్గంధాన్ని భరిస్తూ వారు చేసిన సహాయానికి అందరూ ఫిదా అయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు చేరవేసే విషయంలో 108 సిబ్బంది కూడా నిర్విరామంగా పని చేశారు. బాధిత కార్మిక కుటుంబాల కోసం ఫ్యాక్టరీ వద్ద భోజనం, తాత్కాలిక వసతి ఇతరత్రా సౌకర్యాలు కల్పించిన అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.