
- నేలకొండపల్లి మండలంలో 2,992 దరఖాస్తులు
- ఎక్కువగా సాదా బైనామా, కొత్త పాసు పుస్తకాలు, భూమి విస్తీర్ణం పైనే..
- అప్లికేషన్లు స్క్రూటినీ చేస్తున్న ఐదు రెవెన్యూ బృందాలు
నేలకొండపల్లి, వెలుగు : భూ భారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నాలుగు మండలాల్లో రెవెన్యూ అవగాహన సదస్సులు బుధవారం ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మండలం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి చెందడంతో జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు మరింత పకడ్బందీగా నిర్వహించారు. ఏప్రిల్17న మండలంలోని నాచేపల్లి గ్రామంలో భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు.
మండలంలోని 32 గ్రామ పంచాయతీలలో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ ల నేతృత్వంలో ఐదుగురు అధికారులతో రెండు బృందాలుగా 30 వరకు సదస్సులు నిర్వహించారు. సదస్సుల్లో 2,690 దరఖాస్తులు నేరుగా రాగా, తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ ద్వారా 302 అప్లికేషన్లు వచ్చాయి. వీటి ఆధారంగా 2,366 సర్వే నెంబర్లకు సంబంధించి రైతులు తమ సమస్యలు పేర్కొన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. సాదాబైనామా సమస్యపైనే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
మిగతావి కొత్త పాసు పుస్తకాలు, భూమి తక్కువ విస్తీర్ణం సమస్యల పైన వచ్చాయి. రెవిన్యూ అధికారులు నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్ నేతృత్వంలో ఐదు బృందాలుగా ఏర్పడి దరఖాస్తులను స్క్రూటినీ నిర్వహిస్తున్నారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామ పంచాయతీల్లోని అప్లికేషన్లను స్క్రూటినీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.