- ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్‌పై వేటు పడింది. కొంతకాలంగా ఆయనపై అవినీతి ఆరోపణలు వినిపిస్తుండడంతో పాటు ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
కమిషనర్‌గా గ్రూప్–1 క్యాడర్ ఆఫీసర్ కొయ్యడ ఉదయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. కమిషనర్శ్రీనివాస్ తో సహ పలువురు ఉద్యోగులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల మున్సిపల్ సఫాయి కార్మికుడు బొల్లి రాజయ్య సింగరేణి ఏరియాలో చెట్ల కటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతిచెందారు. దీంతో తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ చాంబర్ ను ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది.
నాలుగు రోజులుగా కార్మికులు ఆఫీస్ఎదుట రిలే నిరవధిక దీక్షకు దిగారు. మున్సిపాలిటీలో భారీగా నిధులు కాజేసినట్లుగా పట్టణ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దసరా ఉత్సవాలు, మొక్కల పెంపకం పేరిట భారీగా నిధులు కాజేసినట్టు ఆరోపించారు.
టౌన్ పరిధిలో సెల్లార్లకు పర్మిషన్లు లేకున్నా, ఆఫీసర్ల సపోర్ట్ తోనే నిర్మాణాలు చేస్తుండడంతో కమిషనర్ తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో శ్రీనివాస్ పై బదిలీ వేటు వేసినట్లుగా పలువురు మున్సిపాలిటీ ఉద్యోగులు పేర్కొన్నారు.
