అక్రమార్జన చేసిన దొంగలపై యుద్ధం చేద్దాం : గండ్ర సత్యనారాయణరావు

అక్రమార్జన చేసిన దొంగలపై యుద్ధం చేద్దాం : గండ్ర సత్యనారాయణరావు
  •     భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట/ పరకాల, వెలుగు : తహారాపూర్​ గుట్టల్లో క్రషర్ల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అక్రమార్జనకు పాల్పడ్డ దొంగలపై యుద్ధం చేద్దామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణారావు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు క్రషర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  అంతకుముందు హన్మకొండలోని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ఇంట్లోలో ఏర్పాటు చేసిన పరకాల నియోజకవర్గం నడికుడ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి 

ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, రాష్ట్ర నాయకులు రాంనర్సింహారెడ్డి, కత్తి వెంకటస్వామి, అప్పం కిషన్, ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.