
రాయ్‌పూర్: కరోనా సెకండ్ వేవ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేయలేదని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ మ్యూటేషన్, కేంద్ర ప్రభుత్వ తీరు లాంటి వాటిపై భూషేశ్ భగేల్ మాట్లాడారు. తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు. కొన్ని కేసుల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేసినా వైరస్ జాడ కనిపించడం లేదని, సీటీ స్కానులు చేయిస్తే గానీ పాజిటివ్ అనే విషయం తెలియట్లేదన్నారు.
‘సెకండ్ వేవ్ విషయంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందనేది కేంద్రానికి తెలుస్తుంది. కాబట్టి సెకండ్ వేవ్‌కు గురైన దేశాల నుంచి భారత ప్రభుత్వం సమాచారాన్ని రాబట్టాల్సింది. వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, లక్షణాలు ఎలా ఉన్నాయి, ట్రీట్‌మెంట్ ఎలా చేశారనే అంశాల గురించి ముందే ఓ అవగాహనకు రావాల్సింది. కానీ కేంద్రం అలా చేయలేదు. వాళ్లు ఆలస్యం చేశారు. రెమిడెసివిర్‌ను ఇతర దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. అదే సమయంలో ఇతర కంట్రీలకు 6.5 కోట్ల టీకాలను ఎక్స్‌పోర్ట్ చేశాం. మన దేశ ప్రజలకు సరిపడా టీకా నిల్వలు లేనప్పుడు వేరే దేశాలకు పంపడం అవసరమా? ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవడం మీద దృష్టి పెట్టాలి’ అని భగేల్ సూచించారు.