పైరవీకారులకే గాంధీ భవన్​లో చోటు

పైరవీకారులకే గాంధీ భవన్​లో చోటు

మార్ఫింగ్​ వీడియోలపై విచారించాలి: వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : గాంధీ భవన్​లో పైరవీకారులకే చోటు దక్కుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ కమిటీల్లో తామిచ్చిన పేర్లను పట్టించుకోలేదని, సీనియ ర్లకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్​లో ప్రతి కార్యకర్త పీసీసీ చీఫ్​తో సమానమని, అందరికీ ఒకే గౌరవం ఉంటుందన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి పార్టీ రాష్ట్ర అబ్జర్వర్​గా దిగ్విజయ్ సింగ్​ను నియమించారని చెప్పినట్లు పేర్కొన్నారు. హైకమాండ్ దిగ్విజయ్​ను కేటాయించడం మంచి పరిణామం అన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్​లో పీసీసీ ఎందుకు ప్రచారం చేయలేదో, మునుగోడులో నాకు తెలియకుండా సభ పెట్టి నన్ను తిట్టడం, మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలన్నారు. 

అన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి

అన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని, ఏపీ లో ఆరోగ్య శ్రీ కింద 2500 రకాల జబ్బులకు ట్రీట్​మెంట్​ అందుతోందని, రూ.1000 దాటితే మెడికల్ బిల్లు ఉండదని వెంకట్​రెడ్డి గుర్తు చేశారు. ఎస్ఎల్​బీసీ, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జనవరిలో పాదయాత్ర నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వకుంటే కోర్టుకెళ్లి తెచ్చుకుంటానన్నారు.