
- ఐదు తులాల గోల్డ్ చైన్ తో పరార్
శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు: రోడ్డుపై వెళ్తున్న మహిళకు గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై లిఫ్ట్ ఇచ్చి, ఆపై దాడి చేసి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం..
నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ(60), బుధవారం తన భూమికి సంబంధించిన పని కోసం మాధారం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంది. స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తూ.. మార్గమధ్యలో ఆపాడు. అనంతరం దాడి చేసి మహిళ మెడలోని 5 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు.
సావిత్రమ్మకు గాయాలవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
దృష్టి మరల్చి బంగారం చోరీ..
పాపన్నపేట: దంపతుల దృష్టి మరల్చి బంగారు నగలు చోరీ చేసిన ఘటన మెదక్జిల్లాలో జరిగింది. పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. పాపన్నపేట మండలం నాగసాన్ పల్లికి చెందిన భూసనెల్లి కిషన్, మణెమ్మ దంపతులు బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు బుధవారం టేక్మాల్ మండలం ఎల్లుపేటకు స్కూటీపై వెళ్తున్నారు.
కొత్తపల్లి బ్రిడ్జి వద్ద ఎదురుగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆపారు. తాము ఆఫీసర్లమని, గలతో బయట తిరగొద్దని, తీసి మూట కట్టి డిక్కీలో వేసుకోమని చెప్పారు. మణెమ్మ తన మెడలోని 4 తులాల పుస్తెలతాడు, తులంన్నర బంగారు గుండ్లను కర్చీప్ లో కట్టి స్కూటీ డిక్కిలో వేస్తుండగా.. దుండగులు దృష్టిమరల్చి దంపతుల వద్ద నగలను తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటికి బాధితులు డిక్కీలో చూసుకోగా నగలు కనిపించలేదు. పాపన్నపేట స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.