చౌటుప్పల్ లో దివిస్ లాబొరేటరీస్ ను కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చౌటుప్పల్ లో దివిస్ లాబొరేటరీస్ ను కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
  •     ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి 

చౌటుప్పల్, వెలుగు: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని దివిస్ లాబొరేటరీస్ ను కాపాడేందుకే ట్రిబుల్  ఆర్ అలైన్మెంట్ మార్చారని, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో త్రిబుల్‌‌‌‌‌‌‌‌ ఆర్ అలైన్మెంట్ ప్రకారం పోతున్న రైతుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్ రెడ్డిని కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..   ట్రిబుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓఆర్ఆర్ రోడ్డు నుంచి 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకొని చౌటుప్పల్ వద్ద ఉత్తర దక్షిణ ప్రాంతంలో 28 కిలోమీటర్లు ఎందుకు కుదించారని నిలదీశారు.  ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఒకచోట 50 కిలోమీటర్లు మరోచోట 60 కిలోమీటర్లు చౌటుప్పల్ దగ్గరికి వచ్చేసరికి 28 కిలోమీటర్లకు మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలన్నారు.

ప్రస్తుత అలైన్మెంటు దివిస్ ఫార్మా కంపెనీ కాపాడడం కోసమే మార్చారని ఆరోపించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ..  చౌటుప్పల్ మండలంలో ప్రస్తుత అలైన్మెంట్ మూలంగా విలువైన భూములకు, ఇండ్లు తమ ప్లాట్లకు భారీ నష్టం వాటిల్లుతుందని, త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ 60 కిలోమీటర్ల దూరానికి మార్చాలని అన్నారు. అక్కడ కూడా భూమి పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం 3 రేట్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు.

 త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై శాసనమండలి సమావేశంలో చర్చిస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.  కార్యక్రమంలో  సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శి సత్యనారాయణ, భూ నిర్వాసితులు చింతల దామోదర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, కురిమిద్దె శ్రీనివాస్, బోడ సుదర్శన్, భూనిర్వాసితులు పాల్గొన్నారు.