
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం నూతనంగా నియమించిన గ్రామ పాలన అధికారులు(జీపీవోలు) నిత్యం గ్రామాల్లో ఉంటూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం బొమ్మలరామారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీవోలు రైతుల భూసమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
మిస్సింగ్ సర్వే నంబర్లు, ప్రాంతాల మార్పు, ప్రభుత్వ భూములు, సాదాబైనామా, ఫారెస్ట్ భూములు, హద్దుల నిర్ధారణకు సంబంధించి భూభారతి రెవెన్యూ సదస్సులో పొందిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కుల, ఆదాయ, మరణ ధ్రువీకరణ పత్రాలను పెండింగ్ లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
అనంతరం బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి.? ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి.? ఎన్ని కంప్లీట్ అయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రావు, రెవెన్యూ, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఉన్నారు.
నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలి
చౌటుప్పల్, వెలుగు: నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి పబ్బు రాజు గౌడ్ ఆధ్వర్యంలో అల్లాపురం రైతులు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ పరిధిలోని సర్వేనెంబర్ 106లో అల్లాపురం రైతులకు పట్టా భూములున్నాయని, 2018లో రైతులకు పాస్ బుక్స్ ఇచ్చారని పేర్కొన్నారు.
పట్టాదారు పాస్ బుక్స్ వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నా, రైతులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబర్106ను పూర్తిస్థాయిలో సర్వే చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విన్నవించారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. సర్వేనెంబర్ 106ను సర్వే నెంబర్ ను పూర్తిస్థాయిలో సర్వే చేయించి, రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకుడు అర్ధ వెంకట్ రెడ్డి, గ్రామ రైతులు వరకాంతం రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహిపాల్ రెడ్డి, జంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.