45 రోజుల్లో బీఆర్ఎస్ సర్కారు రద్దయితది : ఎంపీ కోమటిరెడ్డి

45 రోజుల్లో బీఆర్ఎస్ సర్కారు రద్దయితది : ఎంపీ కోమటిరెడ్డి

45 రోజుల్లో బీఆర్ఎస్​..  సర్కారు రద్దయితది
రెండ్రోజుల్లో జగదీశ్​రెడ్డి అవినీతి సినిమా చూపిస్త : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
ఇసుక సొమ్ముతో షాబాద్​లో 80 ఎకరాలు కొన్నడని ఆరోపణ

యాదాద్రి, వెలుగు : రాబోయే 45 రోజుల్లో బీఆర్ఎస్​ సర్కారు రద్దయితదని, మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీలు కాబోతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఆగస్టు నెలాఖరు వరకు ఎలక్షన్​ నోటిఫికేషన్​ వస్తుందని చెప్పారు. సోమవారం ఆయన యాదాద్రి జిల్లా మోత్కూరులో మీడియాతో మాట్లాడారు. గౌరెళ్లి–-కొత్తగూడెం నేషనల్​ హైవే ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ సాధించాడంటూ కేటీఆర్​ చేసిన ప్రకటనపై ఎంపీ మండిపడ్డారు. 'కేటీఆర్ అమెరికాలో చదివినవ్.. మాట్లాడితే అర్థముండాలే.. గల్లీలో తిరిగే కిశోర్​కు ఢిల్లీ సంగతేమెరుక. నేషనల్​ హైవేలు ఎంపీల ద్వారా వస్తాయన్న విషయం కూడా తెలియదా’ అని ఎద్దేవా చేశారు. ‘మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కిశోర్​కు నేనే ప్లైట్​టికెట్​ బుక్​చేయిస్తా. 

నేషనల్​ హైవే ఎవరు సాధించారో పీఎంవోలో తెలుసుకుందాం’ అని సవాల్​ విసిరారు. గాలికి గెలిచిన జగదీశ్​రెడ్డి, గాదరి కిశోర్​ వచ్చే ఎన్నికల్లో గాలికే పోతారని అన్నారు. రాష్ట్రం బాగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్​ను గెలిపిస్తారని చెప్పారు. కాంగ్రెస్​సర్కారు ఏర్పడగానే,​సీఎం ఎవరైనా మొదటి సంతకం రూ.4 వేల పింఛన్ పెంపు ఫైల్​మీదనే ఉంటుందన్నారు. ఈ నెల 19న కొల్లాపూర్​బహిరంగ సభలో ప్రియాంక గాంధీ బీసీ డిక్లరేషన్​ ప్రకటిస్తారని ఎంపీ తెలిపారు. పీసీసీ పదవి విషయంలో తాను కొంత బాధపడినప్పటికీ ప్రజల కోసం అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. 

ఇసుక అక్రమంగా తరలిస్తే లారీలు తగలబెడ్త

బస్సు కిరాయికి పైసలు లేని జగదీశ్​రెడ్డి ఇసుక మీద అక్రమంగా సంపాదించి రూ.వేల కోట్లతో భూములు కొన్నాడని ఎంపీ ఆరోపించారు. షాబాద్​లో కొన్న 80 ఎకరాల ల్యాండ్​కు సంబంధించిన సినిమా రెండ్రోజులలో చూపిస్తానని వెంకట్​రెడ్డి తెలిపారు. నాలుగు పార్టీలు మారిన ముసలాయన గుత్తా సుఖేందర్​రెడ్డి ప్రాణభయంతో 12 కార్లను ఎస్కార్ట్​గా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దళితబంధులో ఎమ్మెల్యేలకు 30 నుంచి 40 శాతం వాటా పోతోందని ఎంపీ ఆరోపించారు.  కొత్తగా నిర్మిస్తున్న నేషనల్​హైవేకు తప్ప.. అక్రమంగా ఇసుక తరలిస్తే.. లారీలకు పంచర్​చేయడంతో పాటు అవసరమైతే తగలబెడతానని హెచ్చరించారు. ఇసుక అక్రమంగా తరలకుండా చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతికి ఎంపీ సూచించారు.