ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుతో .. గిరిజనుల సాధికారత

ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుతో .. గిరిజనుల సాధికారత

న్యూఢిల్లీ, వెలుగు : ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు.. తెలంగాణలో గిరిజనుల సాధికారతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని బీఆర్​ఎస్ ​ఎంపీ బీబీ పాటిల్​ అన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ స్థాపనతో రాష్ట్రంలోని గిరిజన జనాభాలో విద్యాపరమైన అంతరాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణలో సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి అనుమతించే కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు–2023 ను బుధ‌‌వారం లోక్‌‌స‌‌భ‌‌లో కేంద్ర విద్యా శాఖ స‌‌హాయ మంత్రి సుభాష్​ సర్కార్ చర్చకు ప్రవేశపెట్టారు. ఈ చర్చలో ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా గిరిజన జనాభా ఉన్నత విద్యను పొందడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.

రాష్ట్రంలో ఆదివాసీల అక్షరాస్యత ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉందన్నారు. 73 శాతానికి బదులు 59 శాతంగానే నమోదైందని సభ్యుల దృష్టికి  తెచ్చారు. ఈ అసమానత ఉన్నత విద్య కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ఎంపీలు ఎన్నో సార్లు కేంద్రం దృష్టికి తెచ్చారన్నారు.

కానీ రాష్ట్ర విభజన జరిగిన సుదీర్ఘ కాలం తర్వాత ఈ యూనివర్సిటీ రాబోతోందన్నారు. అలాగే, సమ్మక్కసారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని స్పీకర్ ద్వారా కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు.