2023లో బీబీనగర్​ ఎయిమ్స్​ పూర్తి

2023లో బీబీనగర్​ ఎయిమ్స్​ పూర్తి

లోక్​సభలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ
న్యూఢిల్లీ, వెలుగు: బీబీ నగర్​ ఎయిమ్స్​ను 2023 నవంబర్​ లోపు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం లోక్​సభలో టీఆర్​ఎస్​ ఎంపీ వెంకటేశ్​ నేతతో పాటు మరికొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, ఫెర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ శాఖల మంత్రి మన్​సుఖ్​ మాండవీయ సమాధానమిచ్చారు. 2019–20 అకడమిక్​ ఇయర్​ నుంచి ఎంబీబీఎస్​ మొదటి బ్యాచ్​ మొదలైందని గుర్తు చేశారు. నిరుడు జూన్​ నుంచి ఔట్​పేషెంట్​ సేవలు మొదలయ్యాయని చెప్పారు. ప్రధాని స్వస్త్య సురక్ష యోజన(పీఎంఎస్​ఎస్​వై) ఫేజ్​ 5, 6, 7 కింద తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు 11 ఎయిమ్స్​లను మంజూరు చేశామన్నారు. రూ.1,028 కోట్లతో బీబీ నగర్​ ఎయిమ్స్​ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపిందని చెప్పారు. ముఖ్యమైన నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ఎగ్జిక్యూటింగ్​ ఏజెన్సీని నియమించినట్టు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. పనుల ఆధారంగా నాలుగేండ్లలో రూ. 28.15 కోట్లు రిలీజ్​ చేశామన్నారు. దేశంలో మొత్తంగా 5 ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. అయితే, మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పూర్​ ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిచామని మన్సుఖ్​ మాండవీయ చెప్పారు. వాటిలో ఎరువుల ప్రొడక్షన్​ మొదలైందన్నారు. కాగా, పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్​ పథకం పోర్టల్​లో ఈ నెల 8 నాటికి దేశంలో 5,714 దరఖాస్తులు అప్​లోడ్​ అయ్యాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చెప్పారు.