వాషింగ్టన్:అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్టు దాడి జరిగి 23 ఏండ్లు పూర్తయిన సందర్భంగా న్యూయార్క్ లోని 9/11 మెమోరియల్ వద్ద బుధవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ఈ ప్రోగ్రామ్ లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తన ప్రత్యర్థి ట్రంప్ పేరుతో ఉన్న 'ట్రంప్ 2024' టోపీని ధరించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
9/11 సంస్మరణ కార్యక్రమానికి బైడెన్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి 'ట్రంప్ 2024' అని రాసిఉన్న టోపీ ధరించాడు. అది చూసిన బైడెన్ సరదాగా అతని టోపీని తీసుకుని పెట్టుకున్నారు.
దీనిపై వైట్ హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ స్పందిస్తూ.. ట్రంప్ టోపీని బైడెన్ పెట్టుకోవడం ఐక్యతకు నిదర్శనమన్నారు.