బఫెట్‌ను ఫాలోకావడమే నే చేసిన పెద్ద తప్పు

బఫెట్‌ను ఫాలోకావడమే నే చేసిన పెద్ద తప్పు

గొప్ప ఇన్వెస్టర్లను ఫాలో కావద్దన్న బిగ్‌‌బేర్‌‌‌‌ శంకర్‌‌‌‌ శర్మ

ఒకే షేరులో మొత్తం డబ్బులు పెట్టొద్దు

రిస్క్ మేనేజ్‌‌మెంట్‌‌ నేర్చుకోవడం ముఖ్యం

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: చాలా మంది ఇన్వెస్టర్లు వారెన్‌‌ బఫెట్‌‌, పీటర్‌‌‌‌ లించ్‌‌ వంటి పేరున్న ఇన్వెస్టర్లను ఫాలో కావాలని అనుకుంటారు. కానీ మార్కెట్లో బిగ్‌‌ బేర్‌‌‌‌గా పేరున్న శంకర్‌‌‌‌ శర్మ మాత్రం వీరిని ఫాలో కావడం తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అని పేర్కొనడం విశేషం. ఒకవేళ ఏదైనా వరం కోరుకోమంటే ఇంకో 25 ఏళ్ల జీవితాన్ని కోరుకుంటానని, గత 25 ఏళ్లలో ఇన్వెస్టింగ్‌‌లో చేసిన  తప్పులను మళ్లీ రిపీట్‌‌ చేయకూడదనుకుంటున్నానని అన్నారు. బఫెట్‌‌, ఫిలిప్‌‌ ఫిషర్‌‌‌‌, పీటర్‌‌‌‌ లించ్‌‌ వంటి గొప్ప ఇన్వెస్టర్లను ఫాలో కావడమే నేను చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పారు. ఎందుకంటే వీరు ఎటువంటి మెథడ్‌‌ను ఇవ్వలేదని, ఈ ఇన్వెస్టర్లు కేవలం పర్సనలైజ్డ్‌‌ విధానాలను మాత్రమే అందించారని అభిప్రాయపడ్డారు.  భిన్నమైన మార్కెట్లుండడంతో ఈ విధానాలు  బిజినెస్‌‌లు లేదా కంపెనీలకు సరిపోవని చెప్పారు. బాగా నడుస్తాయనుకున్న బిజినెస్‌‌లను తక్కువ ధర వద్ద కొనుగోలు చేయడం బఫెట్‌‌ ఇన్వెస్టింగ్‌‌ స్టైల్‌‌ అని శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం బాగా నడుస్తున్న బిజినెస్‌‌లు ఖరీదుగా  ఉన్నాయని, ముఖ్యంగా టెక్నాలజీ షేర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. బఫెట్‌‌ స్టైల్‌‌ను ఫాలో అయ్యేవారు పెద్దగా లాభపడడం లేదని అభిప్రాయపడ్డారు. కాగా, గత కొన్నేళ్ల నుంచి బఫెట్‌‌ ఇన్వెస్టింగ్‌‌ కంపెనీ బెర్క్‌‌షైర్‌‌ హాత్‌‌వే లాభాలు కూడా తగ్గుతుండడంతో బఫెట్‌‌ ఇన్వెస్టింగ్‌‌ స్టైల్‌‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి కనిష్టాల నుంచి హాత్‌‌వే ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ 46 శాతం లాభపడగా, ఇదే టైమ్‌‌లో ఎస్‌‌ అండ్‌‌ పీ 500 ఇండెక్స్‌‌ 62 శాతం పెరిగింది. ‌‌

బ్రాడ్‌‌గా ఎనాలసిస్‌‌ చేయాలి..

‘గొప్ప ఇన్వెస్టర్లను ఫాలో కావాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే వారికి వ్యతిరేకంగా చేయొచ్చు. ఒకే విషయంపై లోతుగా ఎనాలసిస్‌‌ చేయడం కంటే అనేక విషయాలపై బ్రాడ్‌‌గా విశ్లేషించడం బెటర్‌‌‌‌. దీంతో కొన్ని విషయాలను గొప్పగా అర్థం చేసుకోలేకపోయినా, అనేక విషయాలపై నాలెడ్జ్‌‌ పెరుగుతుంది’ అని శర్మ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమ ఆలోచనా పరిధిని విస్తరించుకుంటే ఒకే షేరులో తమ మొత్తం డబ్బులు  పెట్టరని తెలిపారు. ఇన్వెస్టర్లు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనని అన్నారు. 25 షేర్లలో ఇన్వెస్ట్‌‌ చేసి బిలియన్‌‌ డాలర్లను సంపాదించొచ్చన్న శర్మ, 100 షేర్లలో ఇన్వెస్ట్‌‌ చేస్తే ఇంతకన్నా ఎక్కువ లాభపడొచ్చని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో ఒకటి రెండు షేర్లు కాకుండా  వీలైనన్ని ఎక్కువ షేర్లను ఉంచుకోవాలని సలహాయిచ్చారు.

కొత్త ఇన్వెస్టర్లకు నా సలహా..

కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న ఇన్వెస్టర్లకు శంకర్‌‌‌‌ శర్మ కొన్ని సలహాలిచ్చారు. రిస్క్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను నేర్చుకోవాలని, ఒకే షేరులో ఇన్వెస్ట్‌‌చేయడాన్ని మానుకోవాలని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది ఫండ్‌‌ మేనేజర్లు తమ డబ్బుల్లో 1‌‌‌‌0–20 శాతం ఒకే స్టాక్‌‌లో పెడుతున్నారని, భారీగా నష్టపోవడానికి ఇదొక ప్రారంభమని అన్నారు. కొన్ని సార్లు ఈ మెథడ్‌‌  పనిచేసిందంటే దానర్ధం ఈ మెథడ్‌‌ కరెక్ట్‌‌ అని అనుకోవద్దని పేర్కొన్నారు. మార్కెట్లో వస్తున్న సక్సెస్‌‌ను చూసి గర్వపడొద్దన్న శర్మ, వినయం రిస్క్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను నేర్పుతుందని, రిస్క్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ లేకపోతే నష్టపోతారని పేర్కొన్నారు. కేవలం గొప్ప ఇన్వెస్టర్లను మాత్రమే ఫాలో కావొద్దని, ఇన్వెస్టింగ్‌‌, ట్రేడింగ్‌‌కు సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకోవాలని కొత్త ఇన్వెస్టర్లకు సలహాయిచ్చారు. స్కిల్స్‌‌ ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంతే ఎక్కువగా లాభాలను పొందొచ్చని శర్మ పేర్కొన్నారు. ట్రేడింగ్‌‌ అర్థం చేసుకున్నవారు ఎప్పటికైనా బెటర్‌‌‌‌ ఇన్వెస్టర్‌‌‌‌గా మారతారని చెప్పారు. మార్కెట్‌‌ పల్స్‌‌ను అర్థం చేసుకోవడం వీరికి ఈజీగా ఉంటుందని అన్నారు.

For More News..

ఫ్యాన్స్‌ మధ్య ఢీ అంటే ఢీ.. నేటి నుంచి ఇండో-ఆసీస్ క్రికెట్ వార్

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

గ్రేటర్​లో టీఆర్ఎస్​కు నిరుద్యోగులు షాక్ ఇస్తరు!