EPFO పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. పెన్షన్ పొందేందుకు ప్రతి ఏటా సమర్పించాల్సిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను ఇకపై రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే మీ ఇంటి వద్దే పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఈ ఉచిత డోర్‌స్టెప్ సేవలను ప్రారంభించింది.
ఇంటికే పోస్ట్‌మ్యాన్:
చాలా మంది వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న పెన్షనర్లు బ్యాంకులకు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లడం కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వాడటం తెలియని వారికి కూడా ఇది ఇబ్బందిగా ఉంది. ఇలాంటి వారి కోసం పోస్ట్‌మ్యాన్లు నేరుగా మీ ఇంటికే వస్తారు. మీ వద్ద ఉన్న ఆధార్ కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వివరాలను పరిశీలించి.. ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను అక్కడికక్కడే అప్‌లోడ్ చేస్తారు.
గతంలో ఈ సేవలకు కొంత ఛార్జీ వసూలు చేసేవారు. కానీ మార్చిన రూల్స్ ప్రకారం.. పెన్షనర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఛార్జీలను ఈపీఎఫ్ఓ నేరుగా పోస్టల్ శాఖకు చెల్లిస్తుంది. 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలంగా పెన్షన్ నిలిచిపోయిన వారికి లేదా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారికి దీని కింద ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని ఈపీఎఫ్ఓ సంస్థ వెల్లడించింది.
మీరు కూడా ఈ సర్వీస్ పొందాలనుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ 033-22029000 కు కాల్ చేసి ఇంటికి రావాలని కోరొచ్చు. ఒకవేళ పెన్షనర్ మరణించి ఉంటే.. ఆ వివరాలను కూడా డాక్ సేవకులు నమోదు చేసి, చట్టపరమైన వారసులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ మార్చి 2026 నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది.
