
ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో నేతలు ఒక్కొక్కరు ఒక్కోదారి చూసుకుంటున్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరారు. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేంద్రప్రసాద్ రాటూరి, ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కమలేష్ రామన్, సోషల్ మీడియా సలహాదారు కులదీప్ చౌదరి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమక్షంలో ఆప్‌లో చేరినట్లు ఆప్ ఉత్తరాఖండ్ కన్వీనర్ జోత్ సింగ్ బిష్త్ తెలిపారు. వీరి ముగ్గురి చేరికతో ఉత్తరాఖండ్ లో ఆప్ పార్టీ మరింత బలోపేతం అవుతందని సిసోడియా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత పోరు పెరుగుతుండటంతో తాము పార్టీని వీడినట్టు నేతలు చెప్పారు. ముగ్గురు సీనియర్లు రాజీనామా చేయడంతో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్, ఖతిమా ఎమ్మెల్యే భువన్ చంద్ర కప్రితో హరక్ సింగ్ రావత్ ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీలోని అంతర్గత పోరుపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి హరీశ్ రావత్ దూరంగా ఉండటం చర్చానీయాంశంగా మారింది.