దసరాకి జీతాలిచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు

దసరాకి జీతాలిచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు

కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీముల్లో  రెండున్నర లక్షల కోట్ల స్కాం జరిగిందని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ధరణితో రైతుల భూములను దోపిడి చేస్తున్నారని.. భూ మాఫియా కోసమే ధరణి తీసుకొచ్చారన్నారు. ధరణి బాధితుల్లో తాను కూడా ఒక వ్యక్తినని.. తన తండ్రి పేరు మీదున్న భూమి తన పేరుమీదికి మారడం లేదని చెప్పారు. హైదరాబాద్ చుట్టు పక్కల వేల కోట్ల విలువ గల భూములను  కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన స్కాంలన్నీ బయటకి వస్తాయన్నారు. రైతుబంధు పేరుతో రైతులను నిండా ముంచారని మండిపడ్డారు.

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట కేసీఆర్ ప్రజలను మోసం చేశారని.. కేంద్రం నిధులను దారి మళ్లించారని అర్వింద్ అన్నారు. మునుగోడు కోసమే గిరిజన బంధు తెచ్చారన్నారు. విద్య, వైద్యం, రెవెన్యూ, వ్యవసాయం అన్నింట్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని.. ఇదే పోలీసులతో కల్వకుంట్ల కుటుంబాన్ని జైలులో వేస్తామని తెలిపారు. 

కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు సారా, ఇంకొకరు డ్రగ్స్ వ్యాపారం అయితే పెద్దాయన జాతీయ పార్టీ అంటున్నాడని అర్వింద్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిని ఎత్తేసి  రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దసరాకి కూడా సమయానికి జీతాలు ఇచ్చే స్థితిలో రాష్ట్రప్రభుత్వం లేదన్నారు. గీత కార్మికులకు, పాడి రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.