నెపోటిజంపై సల్మాన్ ఖాన్ కామెంట్స్.. షారుఖ్, అక్షయ్‌‌పై ప్రశంసలు‌

నెపోటిజంపై సల్మాన్ ఖాన్ కామెంట్స్.. షారుఖ్, అక్షయ్‌‌పై ప్రశంసలు‌

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణంతో హిందీ సినీ పరిశ్రమలో నెపోటిజంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ బయట నుంచి వచ్చిన టాలెంటెడ్ యంగ్‌‌స్టర్స్‌‌ను బాలీవుడ్ పెద్దలు ఎదగనివ్వడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నెపోటిజంపై స్పందించాడు. ప్రముఖ హిందీ హీరోలు సంజయ్ దత్, సన్నీ డియోల్‌‌తోపాటు దివంగత రిషి కపూర్‌‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఈ స్టార్‌‌లు వాళ్ల తండ్రుల ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారని, కానీ ఇప్పటికీ వాళ్లు పరిశ్రమలో ఉన్నారంటే దానికి అభిమానుల ప్రేమ, ఇష్టమే కారణమని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

‘బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి ఓ యాక్షన్ డైరెక్టర్. ఆ తర్వాత ఆయన డైరెక్టర్‌‌గా మారారు. ఇవ్వాళ అజయ్ దేవగణ్ పెద్ద స్టార్‌‌గా అవతరించారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లను చూసుకుంటే.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వీళ్లకు ఎవరూ తెలియదు. పరిశ్రమలోని ఎవరితోనూ వీళ్లకు పరిచయాలు లేవు. అయినా ఈ ఇద్దరూ పట్టుదల, అంకితభావంతో 20 నుంచి 30 ఏళ్లు శ్రమించారు. కేవలం హార్డ్‌‌వర్క్ వల్లే ఈ ఇద్దరూ ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. నా సొంత విషయానికే వస్తే.. మా నాన్న నాకు ఆఫర్లు ఇప్పించలేదు. నాలో ట్యాలెంట్ ఉంటే దర్శక, నిర్మాతలు పిలిచి చాన్స్ ఇస్తారని ఆయన నమ్మేవారు. నటుల భవిష్యత్ అభిమానుల చేతుల్లో ఉంటుంది. వారికి నచ్చితేనే ఇండస్ట్రీలో ఉండగలం’ అని సల్మాన్ పేర్కొన్నాడు.