
'బిగ్‌బాస్ సీజన్ 9' హౌస్ లో సామాన్యుల ఎంట్రీకి ఎంపిక చేసే ప్రక్రియ ' అగ్నిపరీక్ష' మొదలైంది. 45 మంది పోటీదారుల్లోంచి 15 మందిని ఫైనల్స్‌కు, అందులోంచి ఐదుగురిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తారు. ఈ 'అగ్నిపరీక్ష'కు న్యాయ నిర్ణేతలుగా బిందు మాధవి, నవదీప్, అభిజిత్‌లు, హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు. జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న మొదటి ఎపిసోడ్‌లో ఎనిమిది మందిని పరీక్షించారు. ఇక రెండో ఎపిసోడ్‌లో వచ్చిన కొత్త కంటెస్టెంట్లు ఆకట్టుకోవడమే కాకుండా, కొన్ని ఊహించని సంఘటనలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఎంట్రీ ఇచ్చిన కొత్త కంటెస్టెంట్లు
ఈ ఎపిసోడ్‌లో మొదటిగా అడుగుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్, తన యాక్టింగ్‌పై ఉన్న ఆసక్తితో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేసి, తన శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అతని అంకితభావానికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాప్ 15లోకి పంపించారు.
Also read:-బిగ్ బాస్ 9 'అగ్నిపరీక్ష'.. నల్లగొండ కేతమ్మకు రెడ్ కార్డ్.. జడ్జీలు ఎందుకు 'నో' చెప్పారు?
జడ్జిలకు చిరాకు తెప్పించిన శ్రీజ
ఆ తర్వాత వచ్చిన దమ్ము శ్రీజ తన ఓవర్‌గా మాట్లాడడం, ఆటిట్యూడ్‌తో జడ్జిలకు చిరాకు తెప్పించింది. స్టేజ్‌పై అతిగా ప్రవర్తిస్తూ, ఎవరినీ మాట్లాడనివ్వకుండా వాగడం చూసి జడ్జిలు విస్తుపోయారు. శ్రీముఖి సరదాగా 'ఇలా మొత్తుకుంటే టీవీలు ఆఫ్ చేస్తారు' అని అనగా, 'సీజన్ 3లో నువ్వు ఉన్నప్పుడే టీవీలు ఆఫ్ చేసేవాళ్ళు' అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆమె ప్రవర్తన నచ్చని అభిజిత్, బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇవ్వగా, పవర్ ఫుల్ పీపుల్‌ని హ్యాండిల్ చేయలేక రెడ్ ఫ్లాగ్ ఇచ్చారా అంటూ బిందుమాధవిని ప్రశ్నించింది. ఇక బిందు మాధవిని తన 'ఆడపులి' టైటిల్‌ను లాక్కుంటానని సవాల్ కూడా చేసింది. దీంతో ఇరిటేటింగ్‌గా ఉంది, ఇంట్రెస్టింగ్ లేదు అని బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. నవదీప్ మాత్రం వాళ్ల ఇరిటేటింగ్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. దీంతో శ్రీజ హోల్డ్‌లో పెట్టబడింది.
ఊహించని పరీక్షలు.. ఎలిమినేషన్లు
తరువాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్ తన ధైర్యంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పిడకలు చేయమనగానే చేసి, ఆ తర్వాత చెంపలకు పేడ రుద్దుకోమని అడిగితే తడుముకోకుండా పూసుకుంది. ఆమెకు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో మరికొంతమంది కంటెస్టెంట్లు జడ్జిల నుంచి ఎలిమినేట్ అయ్యారు. చిదానంద శాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురి, అబ్బాయిలే గొప్ప అంటూ అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడిన రవి ఎలిమినేట్ అయ్యారు. రవి మహిళల గురించి తేలిగ్గా మాట్లాడిన తీరుకు బిందు మాధవి కోపంతో ఊగిపోయింది. ఆడవాళ్ళు గర్భం ధరించే 9 నెలల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడటం అందరినీ షాక్‌కు గురిచేసింది.
గ్రీన్ ఫ్లాగ్ అందుకున్న కంటెస్టెంట్లు
ఈ ఎపిసోడ్ లో శ్రేయ తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో ముగ్గురు జడ్జిలనూ ఆకట్టుకుని టాప్ 15కి నేరుగా ఎంపికైంది. సింగర్ శ్రీతేజ్ ఒక అవకాశం ఇద్దామని అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఇక ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ కు బిందు తప్ప మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. మరో వైపు మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి ఆడపిల్లలంటే ఇష్టం లేని తన తండ్రికి ముగ్గురం ఆడపిల్లలమేనంటూ భావోద్వేగంగా తన కథ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్‌లో బిందు, శ్రీముఖిని ఓడించి తన బలాన్ని నిరూపించుకుంది. ఆమెకు బిందు తప్ప మిగతా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.
ఇలా, ఈ రెండో ఎపిసోడ్‌లో కొంతమంది కంటెస్టెంట్లు ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగా, మరికొందరు తమ ఆటిట్యూడ్‌తో జడ్జిలను ఇబ్బంది పెట్టారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఇంకా ఎవరెవరు వస్తారో, ఎవరు టాప్ 15కి వెళ్తారో చూడాలంటే తరువాతి ఎపిసోడ్‌ల కోసం ఎదురుచూడాల్సిందే!