బిగ్‌బాస్‌ 6 : సిల్లీ రీజన్స్ తో లొల్లి

బిగ్‌బాస్‌ 6 : సిల్లీ రీజన్స్ తో లొల్లి

బిగ్‌బాస్‌ సిక్స్.. ఎంటర్‌‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ.. హౌస్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్ మామూలుగా లేదు. కొన్ని వారాలు గడిస్తే కానీ దొరకని మసాలా మొత్తం స్టార్టింగ్‌లోనే ప్రేక్షకులకి దొరికేస్తోంది. దాంతో ఈ సీజన్‌ మిగతా సీజన్లను మించి టీఆర్పీ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

నెగిటివిటీ పీక్స్.. రేవంత్ షాక్స్

మాట జారితే వెనక్కి తీసుకోలేం అంటారు. మాట తూటా కంటే వేగంగా దూసుకెళ్లి గాయం చేస్తుందని అంటారు. రేవంత్‌కి ఈ విషయాలు తెలిస్తే బాగుణ్ను అంటున్నారు బిగ్‌బాస్ హౌస్‌మేట్లు. క్లాస్‌ వాళ్లని డైరెక్టర్‌‌గా ఎలిమినేషన్‌ నుంచి సేవ్ చేసిన బిగ్‌బాస్.. మిగతా వాళ్లకి నామినేషన్ల పర్వం తప్పదని చెప్పాడు. దాంతో రగడ మొదలయ్యింది. హౌస్‌లో దాదాపు అందరూ రేవంత్‌ని నామినేట్ చేశారు. అందరూ చెప్పిన రీజన్ ఒకటే.. దూకుడుగా మాట్లాడుతున్నాడు, ఎదుటివాళ్ల ఫీలింగ్స్ పట్టించుకోవట్లేదు అని. ఒకటే కదా, రెండే కదా అంటూ మొదట్లో లైట్‌ తీసుకున్న రేవంత్.. ప్రతి ఒక్కరూ తననే నామినేట్ చేస్తుండేసరికి కాస్త షాక్ తిన్నాడు. తనని తాను జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎదుటివాళ్ల అభిప్రాయాన్ని ఖండించే ప్రయత్నమూ చేశాడు. ఓ టైమ్‌లో కాస్త తగ్గి సారీ చెప్పాడు. తనని తాను మార్చుకుంటాననీ మాటిచ్చాడు. మరి ఆ మాట మీద ఎన్నాళ్లు నిలబడతాడో చూడాలి. 

సిల్లీ రీజన్స్ తో లొల్లి

మొదటి నామినేషన్ కావడంతో కొందరు ఎవరి పేరు చెప్పాలో తెలియక తడబడ్డారు. కొందరు ఇతరుల విషయంలో పొరబడి నామినేట్ కూడా చేసేశారు. రేవంత్‌తో అర్జున్ ఏదో చెబుతుంటే అది తన గురించేనేమో అనుకుని అతనిని నామినేట్ చేసేసింది ఫైమా. ఆ తర్వాత దానికి అర్జున్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. తనది తప్పని ఫైమాకి అర్థమై ఉంటుంది. కానీ నామినేషన్‌ని అయితే వెనక్కి తీసుకోలేదు కదా. ఇక రేవంత్‌ని నామినేట్ చేయడానికి కీర్తి చెప్పిన రీజన్ తనకి రిలేట్ అయ్యి ఉండటంతో శ్రీహాన్ ఖండించాడు. తనని నామినేట్ చేయడానికి రేవంత్ చెప్పిన రీజన్ కూడా సిల్లీగా ఉందంటూ ఆరోహి ఆరోపించింది. ఆరోహి తనని బాడీ షేమింగ్ చేసిందని మరీనా చెప్పడం ఆమెని షాక్‌కి గురి చేసింది. ఆమె తప్పుగా విని తనని నామినేట్ చేసిందంటూ ఫీలయ్యింది. 

ఇలా కొందరు సరైన కారణాలు లేకుండా ఏదో చేయాలి కదా అని సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసేయడంతో ఇంట్లో కాస్త లొల్లి జరిగింది. అయితే తన నామినేషన్ విషయంలో సుదీప చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రేవంత్ అభ్యంతరం చెప్పినప్పుడు తన వాయిస్‌ని గట్టిగా వినిపించింది. అది తన అభిప్రాయమని కుండ బద్దలు కొట్టింది తప్ప తగ్గలేదు. ఇక చలాకీ చంటి కూడా చాలా చక్కని రీజన్స్ తో నామినేట్ చేశాడు. మెచ్యూర్డ్ గా వ్యవహరించాడు. ఎవరితోనూ కలవడం లేదు, యాటిట్యూడ్ చూపిస్తోంది అంటూ చాలామంది తన పేరు చెప్పినా.. శ్రీ సత్య తొణకలేదు, బెణకలేదు. పైగా నవ్వుతూ వాళ్ల అభిప్రాయాల్ని యాక్సెప్ట్ చేసింది. తాను నామినేషన్స్ వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అలా ఉండటానికి గల కారణాలను స్ట్రాంగ్‌గా వెలిబుచ్చింది.

ఇవాళ్టి ఎపిసోడ్‌పై ఆసక్తి

మొత్తంగా మొదటి నామినేషన్ల ప్రక్రియ కారణంగా ఇవాళ్టి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. ఎందుకంటే తమ పేరు చెప్పిన వారిపై అవతలివాళ్లు పగబడతారా లేక ఇదంతా గేమ్‌లో భాగమని లైట్ తీసుకుంటారా అనేది ఇవాళ తెలుస్తుంది. అయితే ప్రోమోలో చూపించినదాన్ని బట్టి ఇవాళ గలాటా గీతూకి గట్టి షాకులే తగులుతాయనిపిస్తోంది. ఆమె మాట తీరుని కొందరు తప్పుబట్టడం, ఆమె అలిగి లేచి వెళ్లిపోవడం కనిపిస్తోంది. ఏం జరుగుతుందో ఇవాళ రాత్రికి చూడాల్సిందే!