బిగ్‌బాస్ : గీత దాటేశారు

బిగ్‌బాస్ : గీత దాటేశారు

బిగ్‌బాస్ అడవిలో దొంగ, పోలీస్ ఆట మొదటి రోజు మస్తుమస్తుగా సాగింది. రెండో రోజు రసవత్తరంగా మారింది. దొంగలకీ పోలీసులకి గొడవలు జరిగాయి. దొంగల్లో దొంగలకే గొడవ వచ్చింది. దొంగల ఎత్తులు, పోలీసులపై ఎత్తులతో నానా హంగామా జరిగింది. మొత్తంగా ఇంట్లో రచ్చ రచ్చ అయింది.

ఎవరి ఆట వారిదే!
దొంగలది ఒక గ్రూప్. పోలీసులది ఒక గ్రూప్. ఎవరి జట్టుతో కలిసి వాళ్లు ఆడుకోవాలి. కానీ అదేం విచిత్రమో.. అందరూ తమ విధుల్ని మర్చిపోయి, తమది ఒక గ్రూప్ అని మర్చిపోయి ఎవరి ఆట వాళ్లు ఆడుకున్నారు. రూల్స్ ను వయోలేట్ చేయడంలో గీతూని మించినవాళ్లు లేరు. ఆమె తన మానాన తాను ఆడుకుంటూ పోతోంది. తనకి నచ్చిన రూల్స్ తను పెట్టేసుకుంటోంది. వస్తువుల్ని కొనుక్కోమ్మా అని చెబితే అతి తెలివి ప్రదర్శించి కొట్టుకొచ్చేసింది. పోలీసులేమో దొంగల్నుంచి వస్తువుల్ని కాపాడాల్సింది పోయి, వాళ్లే అన్నింటినీ దొంగిలించి మూటకట్టి దాచుకుంటున్నారు. ఇక దొంగల గుంపులో అసలు యూనిటీ అన్నదే లేదు. వాళ్ల వస్తువుల్ని వాళ్లే దొంగిలించేసుకుంటున్నారు. వాటిని కాపాడుకోవడంతోనే కాలయాపన చేస్తున్నారు. ఈ రభసంతా చూసి బిగ్‌బాస్‌కే బుర్ర తిరిగిందో ఏమో.. మధ్యలో కల్పించుకున్నాడు. ఆట ఎలా ఆడాలో మరోసారి వివరించి చెప్పాడు. 

తెలివా? అతి తెలివా?
గీతూ తెలివిగా స్ట్రాటజీలు వేస్తుంటే అందులో సూర్య, శ్రీహాన్ చక్కగా ఇరుక్కుంటున్నారు. ఆమె డీల్‌కి ఓకే చెబుతున్నారు. అంతలో ఆరోహి, నేహ కలిసి రేవంత్‌ని కెప్టెన్సీ పోటీకి రానివ్వకూడదని ప్లాన్ వేశారు. అతని బొమ్మలన్నింటినీ ఎత్తుకుపోయారు. దాంతో రేవంత్ రెచ్చిపోయాడు. నిజాయతీ అంటూ కబుర్లు చెప్తారు. ఇదేనా నిజాయతీ అంటే అంటూ మండిపడ్డాడు. సిగ్గూ శరం లేదు అంటూ తెగ తిట్టిపోశాడు. ఆ తర్వాత ఆవేశంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతను దొంగల టీమ్ సభ్యుడే అయినా పోలీసుల్ని గెలిపిస్తానని చాలెంజ్ చేశాడు. అది తప్పు కదా అంటూ సుదీప ఏదో సర్దిచెప్పబోయింది. అదేం కుదరదన్నాడు. ఆ తర్వాత సూర్య, శ్రీహాన్ కూడా వచ్చి కన్విన్స్ చేయబోయారు. తనతో అంత వీజీ కాదని తేల్చేశాడు. కావలసిస్తే తన బొమ్మలు తీసుకోమంటూ పోలీసుల హెడ్ ఆదిరెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. అదేదో మాకు ఇవ్వూ..లేదంటే అమ్మేసెయ్ అంటూ అర్జున్, సూర్య లాంటి వాళ్లు అడిగినా నో అన్నాడు. దాంతో ఇది తెలివా, అతి తెలివా అనేది అర్థం కాక అతని టీమ్‌లోని మిగతావాళ్లంతా కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. 

గీత దాటేశారు
అడవి అన్నారు కదా అని ఆటను కూడా వేటలా ఫీలైపోతున్నారు కంటెస్టెంట్లు. రూల్స్ మర్చిపోవడమే కాక ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అంటూ వాదనలకు దిగుతున్నారు. ఒక్కోసారి వైల్డ్ కూడా అవుతున్నారు. పోలీసులు రెయిడ్‌ చేసినప్పుడు వాళ్లని దొంగలు అడ్డుకోవచ్చు. రెయిడ్ టైమ్ అయిపోయిన తర్వాత కూడా పోలీసులు ఇంట్లోనే ఉంటే కనుక వాళ్లని కిడ్నాప్ చేసి బంధించొచ్చు. ఆ విషయాన్ని ఇన్‌స్పెక్టర్ ఇనయా మర్చిపోయింది. రెయిడ్ టైమ్ అయిపోయినా స్టోర్ రూమ్‌లో ఉండిపోయింది. దాంతో దొంగలు ఆమెను పట్టుకున్నారు. బలవంతంగా బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరు ముగ్గురు ఆమెను పట్టుకోవడంతో తోపులాట మొదలయ్యింది. అసలే అగ్రెసివ్‌గా ఉండే ఇనయా ఇది భరించలేకపోయింది. ఆరోహిని తన్నింది. నేహాని కొట్టింది. ఇంకేముంది.. అంతగా కొట్టాలా అంటూ పంచాయతీ మొదలు. ఎదుటివాళ్ల ఫీలింగ్స్ తో ఇనయాకి పనిలేదు కాబట్టి తన మానాన తన వాదన వినిపిస్తూనే ఉంది. తన డ్రెస్ ఎవరో పైకి లాగేశారంది, తీసేశారంది. ఇంకా ఏవేవో అనేసింది. దాంతో రివ్యూలు చేయడానికి రెడీగా ఉండే గీతూ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. మాటలు మారుస్తున్నావ్, నువ్వు మాట్లాడేవన్నీ తప్పులే అంటూ ఆజ్యం పోసింది. తను తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి ఎదుటివాళ్ల మీద నిందలు వేయడం ఇనయాకి అలవాటే అంది. దాంతో ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నారు. మరి ఈ గీత దాటుడు చర్యలకి, మాటలకి వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. 

ఏదేమైనా అడవిలో ఆట మొదలెట్టాక అందరూ తమ తమ అసలు రూపాలు చూపించడం మొదలుపెట్టారు. ఎవరూ ఎవరికీ తగ్గబోమంటూ కదనానికి కాలు దువ్వుతున్నారు. ఆడట్లేదు, ఆడట్లేదు అన్నారు కదా ఇవాళ బాగానే ఫుటేజ్ ఇచ్చానంటూ శ్రీసత్య మురిసిపోతోంది. ఎప్పుడూ కూల్‌గా ఉండే కీర్తికి సైతం ముంచుకొస్తోంది. రూల్స్, రెగ్యులేషన్స్ అంటూ పాకులాడే బాలాదిత్య మరొకరితో కలిసి పోలీసులు దాచుకున్న వస్తువుల్ని తెలివిగా ఎత్తుకొచ్చేశాడు. ఇవాళ్టి ఆట ముగిసేసరికైతే శ్రీహాన్, సూర్యల దగ్గరే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. కానీ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకుంటున్న గీతూ వీళ్లని మించి ప్లాన్డ్ గా ఉంది. ఎక్కువ డబ్బు, బొమ్మలు తన దగ్గరే ఉండాలని రకరకాల ప్లాన్లు వేస్తోంది. మరి ఎవరి స్ట్రాటజీ ఫలిస్తుందో.. కెప్టెన్సీ కోసం పోటీ పడే అవకాశం ఎవరికి లభిస్తుందో రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.