పాము విషంతో రేవ్‌పార్టీ.. చిక్కుల్లో బిగ్‌బాస్‌ ఓటీటీ విజేత

పాము విషంతో రేవ్‌పార్టీ.. చిక్కుల్లో బిగ్‌బాస్‌ ఓటీటీ విజేత

బిగ్‌బాస్‌ ఓటీటీ(హిందీ) సీజన్‌-2 విజేత, ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎల్విష్‌ యాదవ్‌ చిక్కుల్లో పడ్డారు. పోలీసులు తనను అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన పరువు ప్రతిష్టకు భంగం కల్గించవద్దని వేడుకున్నాడు.

అసలేం జరిగింది..?

ఢిల్లీ నోయిడాలోని సెక్టార్‌ 49లో నిర్వహించిన ఓ రేవ్‌పార్టీపై పోలీసులు గురువారం (నవంబర్ 2న) రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో ఎల్విష్‌ యాదవ్‌ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీలో కొన్ని పాములను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో ఐదు తాచు పాములు, ఒక కొండ చిలువ, రెండు తలల పాము, ర్యాట్‌ స్నేక్‌ ఉన్నాయి. వీటితోపాటు పార్టీలో 20 ఎంఎల్‌ పాము విషాన్ని కూడా గుర్తించి.. సీజ్‌ చేశామని చెప్పారు పోలీసులు. 

ఎల్విష్‌ యాదవ్ ఒక పామును చేతితో పట్టుకొని అడుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో ఆయనపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి సందర్భంగా అరెస్టు చేసిన వారిని ప్రశ్నించగా ఎల్విష్‌ పేరు బయటకు వచ్చింది. ఎల్విష్‌ నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని వారు పోలీసులకు తెలియజేశారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటామని అంగీకరించారు.  ఈ దాడుల్లో మాదకద్రవ్యాల నిరోధక శాఖ, అటవీ శాఖ, నోయిడా పోలీసులు పాల్గొన్నారు. 

తనను అరెస్ట్​ చేసినట్లు వచ్చిన వార్తలను ఎల్విష్​ యాదవ్ తీవ్రంగా ఖండించారు. తాను ఉత్తరప్రదేశ్​ పోలీసుల దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉదయం నిద్ర లేచినప్పుడు తనను అరెస్ట్​ చేశారనే వార్తలు తనను తీవ్రంగా బాధించాయని, అరెస్ట్​ విషయంలో నిజం లేదని ఇన్ స్టా గ్రామ్ ద్వారా చెప్పాడు.  

పాము విషయం సరఫరా చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు ఎల్విష్​ యాదవ్​. ఆధారాలు దొరికేంత వరకు తన ఇమేజ్‌ను నాశనం చేయవద్దని మీడియాను కోరాడు.