
తెలుగు రియాలిటీ షో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ సీజన్ 9' సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. ఈసారి హౌస్‌లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించడంతో ఆసక్తి రెట్టింపు అయింది. అయితే, సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ఒక ప్రత్యేక ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష ' షో ఈ రోజు ( ఆగస్టు 22 ) నుండి జియో హాట్ స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..
సింపతీకి చోటు లేదు!
'బిగ్‌బాస్ సీజన్ 9' హౌస్‌లోకి ఎలాగైనా అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న వారిలో ఒకరైన మల్టీస్టార్ మన్మద రాజా ఈ అగ్నిపరీక్షలో పాల్గొన్నాడు. గతంలో 'బిగ్‌బాస్' టీమ్ కంట్లో పడటానికి ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కూడా చేసిన ఇతడు, మొదటి ఎపిసోడ్‌లో జడ్జిల ముందు సింపతీ కోసం ప్రయత్నించాడు. కానీ, న్యాయ నిర్ణేతలుగా ఉన్న నవదీప్, అభిజిత్, బిందు మాధవి అతడిని తిరస్కరించారు. కేవలం సింపతీతో 'బిగ్‌బాస్'లో చోటు ఉండదని స్పష్టం చేస్తూ, అతడిని ఎలిమినేట్ చేశారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో పిచ్చి పనులు చేసే వారికి ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది.
విచిత్రమైన టాస్క్‌లు, కౌంటర్లు..
రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక మహిళా కంటెస్టెంట్, జడ్జిలు పేడ రుద్దుకోమని చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా బుగ్గలకు పూసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు, దమ్ము శ్రీజ అనే కంటెస్టెంట్ తన అతితో జడ్జిలకు చిరాకు తెప్పించింది. ఆమె అరుపులను చూసి శ్రీముఖి సరదాగా "ఇలా మొత్తుకుంటే పిల్లలు టీవీలు బంద్ చేస్తారు" అనగా, శ్రీజ వెంటనే "అయితే సీజన్ 3లో నువ్వున్నప్పుడే టీవీలు ఆఫ్ చేసేవారు" అంటూ కౌంటరిచ్చింది. అభిజిత్ ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వగానే, "పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్లను హ్యాండిల్ చేయలేక రెడ్ ఇచ్చారా?" అని నిలదీయడం హైలైట్ గా నిలిచింది.
►ALSO READ | విశాల్‌తో అంజలి 'మద గజ రాజా' సెంటిమెంట్.. హిట్ కోసం మరోసారి జత!
ఈ షోలో కంటెస్టెంట్లు తమ కలలు, కష్టాలు, ప్రేమ కథలు పంచుకుని భావోద్వేగానికి లోనవడం, మహిళా జడ్జి వారిని ఓదార్చడం వంటి హృదయాన్ని కదిలించే సన్నివేశాలు కనిపించాయి. గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య అనే తాత తన పాటతో అందరినీ అలరించారు. 'మిరాయ్' సినిమా ప్రమోషన్స్ కూడా ఈ ఎపిసోడ్‌లో భాగమయ్యాయి. మొత్తం మీద 'బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభంకు ముందే 'అగ్నిపరీక్ష' తో ఆసక్తికరంగా, సంచలనాలతో మొదలైంది. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టేది ఎవరు, విజేతగా నిలిచేది ఎవరు అనే ఉత్కంఠ ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.