21మంది కంటెస్టెంట్లకి బిగ్‌బాస్ స్వాగతం

21మంది కంటెస్టెంట్లకి బిగ్‌బాస్ స్వాగతం

ఉపయోగం లేని షో.. గొడవలు పెడుతుంది.. అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది.. యూత్‌పై, ఫ్యామిలీస్‌పై చెడు ప్రభావం చూపిస్తుంది.. ఇలాంటి షోస్‌ వల్ల అసలు ఎవరికి ఉపయోగం.. ఇలా ఒకటా రెండా.. ఎన్ని నెగిటివ్ కామెంట్స్? అయినా కూడా మోస్ట్ పాపులర్‌‌ షోస్‌లో ఒకటిగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది బిగ్‌బాస్. తాజాగా ఈ షో ఆరో సీజన్‌ మొదలైంది. ‘బిగ్‌బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’ అంటూ బుల్లితెరపై నాగార్జున హవా మళ్లీ స్టార్టయ్యింది. కొత్త ఐడియాలతో, సరికొత్త స్ట్రాటజీలతో ఇరవయ్యొక్క మంది కంటెస్టెంట్లకి హౌస్‌ స్వాగతం పలికింది.

వీరికే చాన్స్!

బిగ్‌బాస్ ప్రోమో బైటికొచ్చినప్పటి నుంచి వీళ్లు వెళ్తున్నారు, వాళ్లు పాల్గొనబోతున్నారు అంటూ చాలా జాబితాలు బైటికి వచ్చాయి. సెలెక్టయిన వారి లిస్టుతో చాలా జాబితాలు మ్యాచ్ కూడా అయ్యాయి. ఈసారి హౌస్‌లోకి మొదట అడుగుపెట్టింది ఒక టీవీ నటి. ‘మనసిచ్చి చూడు’ సీరియల్‌గా బాగా పాపులర్‌‌ అయిన కీర్తి.. ఆ తర్వాత ‘కార్తీకదీపం’లో డాక్టర్ బాబు కూతురిగా నటించింది. ఇప్పుడిలా బిగ్‌బాస్‌ షోకి వచ్చేసింది. కొన్నేళ్ల క్రితం ఓ రోడ్ యాక్సిడెంట్‌లో తన వాళ్లందరినీ పోగొట్టుకున్న కీర్తి.. ఆ బాధను అధిగమించి ఈ స్థాయి వరకు వచ్చింది. ఇక హౌస్‌లో చివర అడుగు పెట్టిన కంటెస్టెంట్ రేవంత్. సింగర్‌‌గా చాలా సూపర్‌‌ హిట్స్ అందుకున్న రేవంత్.. ఇండియన్ ఐడిల్ టైటిల్‌ని కూడా గెలిచాడు. ఈసారి బిగ్‌బాస్ టైటిల్ కొడతానంటూ చాలెంజ్‌కి దిగాడు. ప్రెగ్నెంట్ అయిన భార్యని వదిలి రావడం బాధను కలిగిస్తున్నా.. గెలిచి తీరతానంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇంకా.. ‘నువ్వు నాకు నచ్చావ్‌’లో పింకీగా అదరగొట్టిన సుదీప.. యాక్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, గత సీజన్‌లో కాంట్రవర్శీని క్రియేట్ చేసిన సిరికి కాబోయే భర్త అయిన శ్రీహాన్.. వీజే, స్పోర్ట్స్ ప్రెజెంటర్ నేహా చౌదరి.. కమెడియన్ చలాకీ చంటి.. నటి శ్రీ సత్య.. బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయిన గీతూ రాయల్, ఆదిరెడ్డి.. యాక్టర్ అర్జున్ కళ్యాణ్.. ‘ఆ అంటే అమలాపురం’ అంటూ ఆడిపాడిన అభినయశ్రీ.. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి ‘చంటిగాడు’ మూవీతో హీరోగా మారిన బాలాదిత్య.. నటి వాసంతి కృష్ణ.. ఆర్జే సూర్య.. మోడల్ రాజ్‌ శేఖర్.. ‘జబర్దస్త్’ ఫైమా.. యాక్టర్స్‌, కాబోయే భార్యాభర్తలు అయిన మరీనా, రోహిత్‌లతో పాటు షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆరోహి కూడా హౌస్‌లోకి ఎంటరయ్యారు.

వాళ్లదే డామినేషన్!

బిగ్‌బాస్ హౌస్‌లోకి పాపులర్ సెలెబ్రిటీలెవరూ రావడం లేదనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న కామెంట్. ఎందుకంటే హిందీ బిగ్‌బాస్‌లో ఫేమస్ ఆర్టిస్టులు, పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు, స్వామీజీలు కూడా వస్తుంటారు. కానీ తెలుగులో మాత్రం టాప్‌ పొజిషన్‌లో ఉన్నవాళ్లు కాస్త తక్కువగానే వస్తారు. మొదటి సీజన్‌లో కాస్త ఫర్వాలేదు కానీ ఉండేకొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. గత రెండు సీజన్స్ నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరగడమే అందుకు ఉదాహరణ. ఈసారి కూడా టీవీ, యూట్యూబ్‌, సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవారే ఎక్కువగా ఎంపికయ్యారు. ఉదయభాను వస్తోందని అన్నారు కానీ ఆమె రాలేదు. తనని రప్పించడానికి చాలా ట్రై చేశారని, చివరి వరకు వెయిట్ చేసినా నో అన్నదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. అందరూ అంటున్నదానికి తగినట్టుగానే కంటెంస్టెంట్లు వచ్చారనేది వాస్తవం. టీవీకి కాస్త ఫర్వాలేదు. ఎందుకంటే సినిమా తర్వాత ఎక్కువ రీచ్ ఉన్నది దానికే. రోజూ టీవీలో చూసేవాళ్లే కనుక జనం త్వరగా కనెక్టయిపోతారు. కానీ సోషల్ మీడియా స్టార్స్ ని యూత్‌ చూస్తారే తప్ప గృహిణులు, ఇంట్లో టీవీ చూసే పెద్దవాళ్లు ఫాలో అవడం చాలా తక్కువే. కాబట్టి వాళ్లను ఎక్కువగా తీసుకోవడం కరెక్ట్ కాదనేది కొందరి వాదన. 

ఏదేమైతేనేం.. ఎవరైతేనేం.. బిగ్‌బాస్ హౌస్ అనే మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టాక ఎవరూ వారిలా ఉండరు. కొత్తగా మారిపోతారు. కొత్త బంధాలు ఏర్పడతాయి. కొత్త రూపాలు బయటపడతాయి. కంటెస్టెంట్ల మధ్య నిప్పు రాజేసే స్కిట్లు.. వారం వారం ఎలిమినేషన్లు.. బోలెడన్ని ఎమోషన్లు.. అంతకు మించి వివాదాలు.. బిగ్‌బాస్ అంటే ఇదే. దాన్ని ఎంజాయ్ చేయడం ప్రేక్షకులకు అలవాటే. మరి ఈ సీజన్ సిక్స్ ఎలా ఉండబోతోందో, చివరికి ఎవరికి కిరీటం పెట్టబోతోందో తెలియాలంటే 15 వారాలు వేచి చూడాల్సిందే!