ప్రకృతిని పూజించే.. ఆదివాసుల అతిపెద్ద జాతరలు

ప్రకృతిని పూజించే.. ఆదివాసుల అతిపెద్ద జాతరలు

చెట్టు, పుట్ట.. చేను, చెలకలే ఆదివాసులకు బతుకు తెరువు. అందుకే పండుగొచ్చినా, పబ్బమొచ్చినా వాటికే మొక్కుతరు. ప్రకృతిని పూజించుకుంట ఘనంగా జాతరలు చేస్తారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు జరుపుకునే ప్రతి జాతర ప్రత్యేకమనే చెప్పాలె. ఈ నెలలో(జనవరి) జిల్లాలోని ఏ ఆదివాసులు గూడానికెళ్లినా జాతరలతో హోరెత్తిపోతది. మరి ఈ నెలలో జరగబోయే అతిపెద్ద ఆదివాసుల జాతరలేంటంటే... ఆదివాసులు గూడాల్లో ఈ జనవరిలో పండుగ వాతావరణం ఉంటుంది. ఖాందేవ్, జంగుబాయి, నాగోబా, జంగి, బుడుందేవ్, మహాదేవ్ .. జాతరల కోసం ఆదివాసులు గూడాలన్నీ అందంగా ముస్తాబు అవుతాయి. 

నాగోబా..

మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన ఈ నాగోబాకి ప్రతి ఏటా ఘనంగా జాతర చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసుల జాతరల్లో ఒకటిగా పేరున్న ఈ జాతర ఈ నెల 31న అమావాస్య రాత్రి మొదలవుతుంది.ఈ జాతరకి 15 రోజుల ముందే మెస్రం వంశీయులు గంగాజలం కోసం 300 కిలోమీటర్లు నడిచి, జన్నారం మండలంలోని కలమడుగు గోదావరికి వెళ్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరలో కొత్త కోడళ్ల బేటింగ్ ప్రత్యేకం. తమ ఇంటి కొత్త కోడళ్లను నాగోబా గుడికి తీసుకొచ్చి, పూజలు చేయిస్తారు. అలాగే జాతరకు వచ్చే మెస్రం వంశీయుల సంఖ్య వేలల్లో ఉన్నా.. వాళ్లు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. గుడి చుట్టుపక్కల ఉన్న ఆ పొయ్యిలలో వీళ్లు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. జాతర చివరిరోజు ఆదివాసుల పెద్దలు దర్బార్ పెట్టి సమస్యలు తెలుసుకుంటారు.  

ఖాందేవ్..

ఈ నెలలో జరిగే అతిపెద్ద ఆదివాసుల జాతర లో ఖాందేవ్ ఒకటి. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఈ నెల 16న మొదలైన ఈ జాతర 15 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. తొడసం వంశస్తుల సంప్రదాయ డోలు వాయిద్యాలతో మొదలయ్యే ఈ జాతర వెనుక పెద్ద కథే ఉంది. వందల ఏండ్ల కిందట తొడసం వంశానికి చెందిన ఖమ్ము పటేల్ కి ఖాందేవుడు కలలోకి వచ్చాడట. ఊరంతా పచ్చగా ఉండాలంటే నీ పొలంలో వెలిసిన నాకు పూజలు చెయ్యమని చెప్పాడట. మరుసటి రోజు ఖమ్ము పటేల్ పొలానికి వెళ్లి చూస్తే ఖాందేవుడు ఓస్తంభంలా దర్శనమిచ్చాడు. 

ఆ రోజు నుంచి ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజున ఖాందేవుడి జాతర చేస్తున్నారు తొడసం వంశీయులు. ఈ జాతరలో దేవుడికి నైవేద్యంగా రెండు కిలోల నువ్వుల నూనె సమర్పిస్తారు భక్తులు. ఆ నూనె తాగితే పిల్లలు లేనివాళ్లకి పిల్లలు కలుగుతారని, పాడిపంటలు, కుటుంబం చల్లగా ఉంటుందని నమ్మకం. పక్కరాష్ట్రాల నుంచి కూడా ఈ జాతర చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 

జంగి..

బేల మండలం సదల్పూర్ గ్రామంలోని బైరం దేవ్, మహాదేవ్ ఆలయాల్లో పుష్యమాస బహుళ నవమి రోజు జంగి జాతర జరుగుతుంది. ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరలో కోరంగే వంశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. జాతర ఏడవరోజు జరిగే 'కాలదహి హండి' కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒక కుండలో పెరుగు వేసి ఆలయం పైన జెండా ఎగరేస్తారు. తర్వాత ఆ పెరుగు కుండను పాలు, కుడకలు, అటుకులు, పేలాలు ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా పగలగొడతారు.

పెరుగుతో కలిపిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు ఇవ్వకుండా ఆలయం పై నుంచి కింద ఉన్న భక్తులకు విసిరేస్తారు. ఈ గుడుల విషయానికొస్తే శాతవాహనుల కాలంలో కట్టినట్టు చెబుతారు. ఏదైనా కోరిక కోరుకొని బైరందేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తాలి. కోరిక నెరవేరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందట. లేదంటే కదలకుండా ఉంటుందట. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జంగుబాయి జాతర కూడా మొదలైంది. ఆదివాసులు నెల రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఈ జాతరకి కూడా చాలా విశిష్టతలున్నాయి. 

బుడుందేవ్..

నాగోబా జాతర ముగిసిన తెల్లారే ఉట్నూర్ మండలం శ్యాంపూర్ మెస్రం వంశీయులు బుడుందేవ్ జాతర మొదలుపెడతారు. కొన్నేళ్ల కిందట గౌరాపూరికి చెందిన ఒక ఆంబోతు శ్యాంపూర్ ప్రాంతంలో ఉన్న చేలల్లో పడి పంట నాశనం చేసేదట. దాంతోకొత్వాల్ ఆంబోతును సంహరిస్తాడు. దాన్ని దూరంగా పడేయటానికి వెళ్తుంటే అక్కడే బండరాయిగా మారి బుడుందేవ్ అవతరించిందని ఆదివాసులు పెద్దలు చెప్తారు. పదిహేను రోజుల పాటు ఘనంగా జరుగుతుంది ఈ జాతర.