
- సరఫరా చేస్తున్న వారికి ఐదేండ్ల శిక్ష
కాగజ్ నగర్, వెలుగు: గంజాయి సాగు, సరఫరా చేస్తూ పట్టుబడిన నిందితులకు జైలుశిక్షతో పాటు, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 ఏప్రిల్ 25న పక్కా సమాచారం మేరకు అప్పటి ఎస్సై ఎండీ తహసినోద్దిన్ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చౌరస్తా వద్ద తనిఖీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జాడి స్వీకర్ అలియాస్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎండు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకొని విచారించగా కోసిని వద్ద ఉన్న పర్దాన్ గూడాకు చెందిన కుమ్రం సాయికిశోర్ వద్ద తక్కువ ధరకు కొని అమ్ముతున్నట్లు స్వీకర్ చెప్పాడు.
దీంతో కలిసి సాయి కిశోర్ ఇంటి వద్ద తనిఖీ చేశారు. అతడి ఇంట్లో రెండు కేజీల గంజాయిని దొరికింది. ఆరా తీయగా సిర్పూర్ మండలం కోలంగూడాకి చెందిన ఆత్రం భీము వద్ద గంజాయిని కొంటున్నట్లు చెప్పాడు. భీము ఇంట్లో తనిఖీ చేయగా 1.2 కేజీ ల ఎండు గంజాయి పట్టుబడింది. భీము గంజాయి పండిస్తూ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై ఫిర్యాదు మేరకు అప్పటి కాగజ్ నగర్ టౌన్ సీఐ డి.మోహన్ విచారణ చేపట్టారు. సాక్షులను కోర్టులో హాజరుపరచగా పీపీ జగన్ మోహన్ రావు విచారించి నేరం రుజువు చేశారు.
దీంతో గంజాయి సాగుచేస్తున్న ఆత్రం భీముకు పదేండ్ల జైలు, రూ.10 వేల జరిమానా, గంజాయి సరఫరా చేసిన జాడీ స్వీకర్, సాయి కిశోర్ కు ఐదేండ్ల జైలు, రూ.10 వేల ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీ జగన్ మోహన్ రావు, ఇన్చార్జ్ ఏఎస్పీ చిత్తరంజన్, కాగజనగర్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ఆసిఫాబాద్ డివిజన్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్, సబ్ డివిజన్ సీడీపీవో షిండే బాలాజీని ఎస్పీ అభినందించారు.