
- ఆక్రమించిన ప్రాంతాన్ని వదిలి వెళ్లాలి
- జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లోని ఇందన్ పల్లి రేంజ్ కవ్వాల్ బీట్ లో ఉన్న పాలగోరి ప్రాంతం పూర్తిగా టైగర్ రిజర్వ్‌లోని కోర్ ఎరియాలోని వస్తుందని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. టైగర్ జోన్ లో ఉన్న పాలగోరి అటవీ ప్రాంతానికి నెల రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యు) మండలాలకు చెందిన కొంత మంది పూజల పేరుతో వచ్చి ఇక్కడే గుడిసెలు వేసుకొని మకాం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లి వారికి కౌన్సిలింగ్ ఇచ్చినా వెళ్లకుండా విలువైన టేకు చెట్లను నరికి వేస్తున్నారని తెలిపారు. కవ్వాల్ బీట్ లోని పాలగోరి ప్రాంతాన్ని 1940లోనే అప్పటి నిజాం ప్రభుత్వం అటవీ ప్రాంతంగా గుర్తించిందని, సర్వే నంబర్ 112లోని 9360 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతం మొత్తం టైగర్ జోన్ లోని కోర్ ఏరియాలో ఉందన్నారు. 2022లో మంచిర్యాల ఆర్డీవో సైతం పాలగోరి ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగా వెల్లడించారని, ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోవాలన్నారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జన్నారం, ఇందన్ పల్లి రేంజ్ ఆఫీసర్లు సుస్మారావు, శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు.