నిఘా నీడలో శోభాయాత్ర..మంచిర్యాల జిల్లాలో 2,334 గణేశ్ విగ్రహాల నిమజ్జనం : సీపీ అంబర్ కిషోర్ ఝా

నిఘా నీడలో శోభాయాత్ర..మంచిర్యాల  జిల్లాలో 2,334 గణేశ్ విగ్రహాల నిమజ్జనం : సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల/తాండూరు, వెలుగు: గణేశ్​నిమజ్జనోత్సవాలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం పోలీస్​కమిషనర్ ​అంబర్​కిషోర్​ఝా అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా తాండూరుతోపాటు మంచిర్యాల గోదావరి బ్రిడ్జి దగ్గర వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశాలను కలెక్టర్​కుమార్​దీపక్, డీసీపీ భాస్కర్​, బెల్లంపల్లి సబ్​కలెక్టర్​మనోజ్​తో కలిసి పరిశీలించారు. శుక్రవారం జరిగే నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. 

అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. మంచిర్యాల జోన్​పరిధిలో 2334 వినాయక విగ్రహాలను నిర్వాహకులు నిమజ్జనం చేయనున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్రల బందోబస్తు కోసం ముగ్గురు ఏసీపీలు, 11 బంది సీఐలు, ఆర్ఐలు , 28 మంది ఎస్సైలతోపాటు భారీ బందోబస్త్​ఏర్పాటు చేశామన్నారు. తాండూరు ఐబీలో వినాయకుడి వద్ద అధికారులతో కలిసి సీపీ పూజలు చేశారు. 

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

  • బంగల్ చెరువు కట్టపై భారీ బారికేడ్లు 
  • ప్రమాదాల నివారణకు పక్కా వ్యూహం  

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలో జరిగే వినాయక నిమజ్జన వేడుకల కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. వినాయకులను నిమజ్జనం చేసే బంగల్​పేట్ చెరువు (వినాయక సాగర్) వద్ద భారీ ఏర్పాట్లు చేపట్టారు. చెరువుకట్టపై ప్రతిసారి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఘటనలు జరగకుండా చెరువు మొదలు నుంచి చివరి వరకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు.  

ఈ బారికేడ్ల ఏర్పాటుతో ప్రమాదాలను నియంత్రించవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. దాదాపు 200లకు పైగా విగ్రహాలను ఈ చెరువులో నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. 10 మంది గజ ఈతగాళ్లను ప్రత్యేకంగా రప్పించారు. ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఏర్పాట్లను పరిశీలించారు.