
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై ముంబై పోలీసుల ఆర్థికనేరాల విభాగం ( Economic Offences Wing) కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వ్యాపార పెట్టుబడుల పేరుతో రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై FIR నమోదయింది. అంతే కాదు ఈ కేసు నమోదుతో ఈ జంటపై లుక్ అవుట్ సర్కులర్ కూడా జారీ చేశారు. దీంతో ఈ దంపతులు దేశం విడిచి వెళ్లడానికి కూడా లేదు.
అసలేం జరిగిందంటే..
వ్యాపారం పేరుతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తనను మోసం చేశారని లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కోఠారి ముంబైలోని జుహూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వ్యాపార విస్తరణ కోసం 2015 నుంచి 2023 మధ్య కాలంలో తాను శెట్టి, కుంద్రాకు చెందిన 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీకి రూ. 60.48 కోట్లు బదిలీ చేశానని పేర్కొన్నారు. అయితే, ఈ నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించకుండా, ఈ జంట తమ వ్యక్తిగత ఖర్చుల కోసం మళ్లించారని ఆరోపించారు.
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. కోఠారికి రాజ్ కుంద్రాతో ఒక స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కుంద్రా, శిల్పా శెట్టి ఆన్‌లైన్ షాపింగ్, రిటైల్ ప్లాట్‌ఫారమ్ అయిన 'బెస్ట్ డీల్ టీవీ'లో 87.6% వాటాలను సంయుక్తంగా కలిగి ఉన్నారు. పెట్టుబడిపై ప్రతి నెలా లాభాలను తిరిగి చెల్లిస్తామని, అలాగే అసలు మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని కుంద్రా కోఠారికి హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
►ALSO READ | Shah Rukh Khan : 'కింగ్' మూవీ సెట్స్‌లోకి బాద్షా రీ-ఎంట్రీ.. లీకైన షారుఖ్ ఖాన్ పిక్ వైరల్!
అయితే, 2016లో శిల్పా శెట్టి కంపెనీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత, మరో పెట్టుబడిదారుడిని మోసం చేశారనే ఆరోపణలతో కంపెనీపై దివాలా ప్రక్రియలు ప్రారంభించినట్లు కోఠారికి తెలిసిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈఓడబ్ల్యూ పోలీసులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, మరొక వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 403 (ఆస్తిని అక్రమంగా వినియోగించుకోవడం), 406 ( క్రిమినల్ , నమ్మక ద్రోహం), 34 ( ఉమ్మడి ఉద్దేశం) కింద కేసు నమోదు చేశారు.
ఈడీ దర్యాప్తులో కొత్త ట్విస్ట్!
అయితే ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేయడంతో, మనీలాండరింగ్ కోణంలో కూడా విచారణ జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించుకుంది. ఇప్పటికే రాజ్ కుంద్రాపై గతంలో పోర్నోగ్రఫీ కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా ఈడీ కుంద్రా అక్రమ లావాదేవీలపై దృష్టి సారించింది. ఇప్పుడు ఈ కొత్త మోసం కేసు వెలుగులోకి రావడంతో ఈడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో విదేశీ లావాదేవీలు ఉన్నాయా లేదా అని కూడా ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జంట గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కేసు, పోర్నోగ్రఫీ కేసులతో ఈ జంట తరచూ వార్తల్లో నిలిచారు. లేటెస్ట్ గా ఈ కేసు నమోదు కావడంతో బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తమపై వచ్చిన ఆరోపణలను ఈ జంట ఎలా ఎదుర్కొంటారు, ఈ కేసులో వారికి శిక్ష పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.