కెపాసిటీకి త‌గ్గ గుర్తింపు పొందిన నటుడు పంకజ్ త్రిపాఠి

కెపాసిటీకి త‌గ్గ గుర్తింపు పొందిన నటుడు పంకజ్ త్రిపాఠి

రైలు... ప‌ట్టాల మీద ఉంటే చాలు, ఒక్కోసారి లేట‌యినా, రావాల్సిన టైమ్​కి ఆ రైలు వ‌చ్చి తీరుతుంది. అలాగే, టాలెంటెడ్ యాక్టర్ ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డి ఉంటే చాలు, ఒక్కోసారి లేట‌యినా, రావాల్సిన టైమ్​కి గుర్తింపు వచ్చి తీరుతుంది. ఈ కేటగిరి కిందే వస్తాడు యాక్టర్ పంక‌జ్ త్రిపాఠి. న‌టుడిగా 2004 లో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ఆయ‌న‌కు, ప‌దేండ్ల త‌ర్వాత త‌న కెపాసిటీకి త‌గ్గ గుర్తింపు దొరికింది.

గుర్తింపు- అవార్డులు

‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ చేసిన త‌ర్వాత బాలీవుడ్​లో టాప్ హీరోలందరితో న‌టించా. అయితే వాటికంటే కూడా 2013లో వ‌చ్చిన ‘ఫ‌క్రే’, 2015లో వ‌చ్చిన ‘మ‌సాన్’, 2016లో వ‌చ్చిన ‘నీల్ బ‌ట్టే స‌న్నాట‌‘, 2017లో వ‌చ్చిన ‘బ‌రేలీ కి బ‌ర్ఫీ‘, 2018లో వ‌చ్చిన ‘స్త్రీ’, అదే ఏడాది త‌మిళంలో మొదటిసారి సూప‌ర్​స్టార్ ర‌జ‌నీకాంత్​తో క‌లిసి న‌టించిన ‘కాలా’ మూవీ, 2020లో వ‌చ్చిన ‘లూడో’, పోయిన ఏడాది చేసిన ‘మిమి’ సినిమాలు నాకు మంచి గుర్తింపు, అవార్డులు తెచ్చిపెట్టాయి.

యాక్సెప్ట్ చేస్తే హిట్

‘గ‌త కొన్నేండ్లుగా డైరెక్టర్లు చిన్న టౌన్ స్టోరీలే ఎక్కువగా చెప్తున్నారు. ఎందుకు’ అని నన్ను అడుగుతున్నారు చాలామంది. మీర్జాపూర్ లాంటి చిన్న టౌన్ స్టోరీలో న‌టించా కాబ‌ట్టి, చెప్తున్నా.... మ‌న దేశంలో 700 ల‌కు పైగా జిల్లాలు ఉన్నాయి, వాటిలో ఎన్నో టౌన్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని స్టోరీస్ చెప్పారు. ఇంకా వేలాది స్టోరీలు ఉన్నాయి. ఆ క‌థ‌ల‌న్నీ చెప్పాలి. అయితే, సినిమా బాగుందా? లేదా? అనేది ఆ టౌన్ మీద‌నో, సిటీ మీద‌నో ఆధార‌ప‌డి ఉండ‌దు. ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తే హిట్... లేదంటే ఫెయిల్.

‘‘ఈ ఏడాది డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో విడుద‌లైన ‘క్రిమిన‌ల్ జ‌స్టిస్’ వెబ్ సిరీస్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ఇదే ఏడాది రిలీజైన అక్షయ్ కుమార్ సినిమా ‘బ‌చ్చన్ పాండే’ లో కూడా కీల‌క పాత్రలో న‌టించా. కానీ, అది అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ప్రస్తుతం ‘ఓ మై గాడ్-2’ మూవీ, అమెజాన్ ప్రైమ్​లో విడుద‌ల కాబోతున్న ‘గుల్కండ టేల్స్’ వెబ్ సిరీస్ లలో న‌టిస్తున్నా. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ మూవీలో కూడా కీల‌క పాత్రలో క‌నిపించ‌బోతున్నా.

మాది బిహార్

బీహార్​లోని గోపాల్ గంజ్​లో ఉన్న మారుమూల గ్రామంలో 1976లో పుట్టా. నాన్న పండిత్ బెనార‌స్ తివారి. అమ్మ పేరు హేమ‌వంత్ తివారి. నాన్న వ్యవ‌సాయం చేస్తూనే, గుళ్లో పూజారిగా ప‌ని చేస్తుండేవాడు. ఇంట‌ర్మీడియెట్​ చ‌దివేవ‌ర‌కు నాన్నకు వ్యవ‌సాయ ప‌నుల్లో సాయం చేస్తూ గ‌డిపా. మా ఊళ్లో పండుగ‌లు గ్రాండ్​గా జ‌రిగేవి. పండుగ‌ల‌ప్పుడు వేసే నాట‌కాల్లో ఎక్కువ అమ్మాయి పాత్రల్లో న‌టించేవాడిని. ఏ నాట‌కం వేసినా, ప్రతిసారి మా గ్రామస్తులంతా నా న‌ట‌న‌ను మెచ్చుకునేవారు. దాంతో తెలియ‌కుండానే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ప్లస్ టూ అయ్యాక‌, డిగ్రీ చేయ‌డానికి పాట్నా వెళ్లా.

అక్కడ‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్ మెంట్​లో చేరా. కాలేజీలో ఉన్నప్పుడు నాటకాల్లో నటించేవాడిని. అలాగే, కాలేజీ పాలిటిక్స్​లో యాక్టివ్​గా ఉండేవాడిని. నాటకాల్లో​ చేసినా... మూవీ యాక్టింగ్​లో ఫెయిల్ అవుతానేమో అన్న భ‌యంతో ఇండ‌స్ట్రీకి వెళ్లలేదు. పాట్నాలో ఉన్న మ‌యూర హోట‌ల్​లో ఉద్యోగంలో చేరా. అలా ఏడేండ్లు పాట్నాలోనే ఉన్నా. కానీ, లోలోప‌ల యాక్టర్ కావాల‌నే క‌ల నిద్రపోనియ్య లేదు. చివ‌రికి ఏదైతే అదైందని ఢిల్లీకి వెళ్లి నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరా. అలా 2004 యాక్టింగ్​లో  డిగ్రీ అందుకున్నా. ఆ త‌ర్వాత యాక్టింగ్ అవ‌కాశాలు వెతుక్కుంటూ ముంబై చేరుకున్నా.

అడ్వర్టైజ్​మెంట్​తో మొదలుపెట్టి

ముంబైలో చాలా చోట్ల ఆడిష‌న్స్ ఇచ్చా. మొద‌టిసారి టాటా టీ యాడ్​లో పొలిటిషియ‌న్ పాత్రలో చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆ త‌ర్వాత ‘ర‌న్’ మూవీలో క‌నీసం క్రెడిట్ కూడా ఇవ్వని పాత్రలో న‌టించా. బాలీవుడ్​లో అదే నా ఫ‌స్ట్ మూవీ. ఆ త‌ర్వాత కూడా ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేస్తూ వ‌చ్చా. కానీ, ఎక్కడా మంచి పాత్ర ప‌డ‌లేదు. మంచి పాత్ర ప‌డిన సినిమాలో పేరు రాలేదు.

మ‌ధ్యలో కొన్ని టీవీ షోలు కూడా చేశా. ఫైన‌ల్​గా 2012లో అనురాగ్ కశ్యప్ డైరెక్షన్​లో వ‌చ్చిన  ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ లో చేసిన సుల్తాన్ ఖురేషీ పాత్ర నాలోని యాక్టర్​కి స‌రైన గుర్తింపు తెచ్చింది. సుల్తాన్ ఖురేషి పాత్ర కోసం దాదాపు ఎనిమిది గంట‌లు ఆడిష‌న్ ఇచ్చా. ఆ సినిమా త‌ర్వాత నెగెటివ్ క్యారెక్టర్స్ క్యూ క‌ట్టాయి. అందులోనూ ఎక్కువ గ్యాంగ్ స్టర్ పాత్రలే వ‌చ్చాయి.  ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకు న్యాయం చేయ‌డమే ల‌క్ష్యంగా చేసుకుంటూ వెళ్లా.

వెబ్ ప్రపంచం తెచ్చిన పేరు

మారుతున్న కాలంతో పాటే మనమూ మారాల‌ని న‌మ్ముతా. ‘మీర్జాపూర్’ లాంటి వెబ్ సిరీస్​ ఒక ప్రయోగం. అప్పటికీ ఇంకా వెబ్ సిరీస్​లు అంత‌గా పాపుల‌ర్ కాలేదు. అయినా స‌రే, డైరెక్టర్ చెప్పిన క‌థ న‌చ్చింది. కాబ‌ట్టి, ఆ ప్రయోగానికి ఓకే చెప్పా. ‘మీర్జాపూర్’ అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయింది. అన్నీ భాష‌ల్లోకి అనువాద‌మైంది. అమెజాన్ ప్రైమ్​లో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ దేశం మొత్తం న‌న్ను గుర్తుప‌ట్టేలా చేసింది. అదే ఏడాది నెట్​ఫ్లిక్స్​లో ‘సేక్రెడ్​ గేమ్స్’, ఆ త‌ర్వాత డిస్నీప్లస్ హాట్ స్టార్​లో విడుద‌లైన ‘క్రిమిన‌ల్ జ‌స్టిస్’ వంటి సిరీస్​లు వెబ్ ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్

నా లైఫ్ పార్ట్​న‌ర్ మృదుల‌తో పరిచయమైనప్పుడు నేను ఇంట‌ర్మీడియెట్​ చదువుతున్నా. అప్పుడామె తొమ్మిదో క్లాస్ చదువుతోంది. ఆమెను చూడ‌గానే ప్రేమ‌లో ప‌డిపోయా. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అన్నమాట‌. మా అక్కను, మృదుల వాళ్ల అన్నయ్యకు ఇచ్చాం. కాబ‌ట్టి, ఒకే ఫ్యామిలీలో రెండు పెండ్లిళ్లకు మా వాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించ‌డానికి చాలా క‌ష్టాలు ప‌డ్డాం. 2004లో పెద్దల స‌మ‌క్షంలోనే పెండ్లి చేసుకున్నాం. మా పెండ్లి అయిన వెంట‌నే ఇద్దరం క‌లిసి ముంబైకి వెళ్లిపోయాం. పెండ్లయిన రెండేళ్లకు కూతురు పుట్టింది.

బ‌ర్నౌట్ అయ్యానా?

ఐదారేండ్లుగా ఏడాదికి యావ‌రేజ్​గా ఆరు నుంచి ఏడు సినిమాలు, రెండు వెబ్ ఫిల్మ్స్ చేస్తున్నా. చెప్పాలంటే ఇది ఓవ‌ర్ వ‌ర్క్. ఒక్కోసారి బ‌ర్నౌట్ స్టేజికి చేరిపోయానేమో అనిపిస్తుంది. సినిమాల్లో యాక్ట్ చేసి అల‌సిపోయిన‌ట్టు కూడా అనిపిస్తుంటుంది. అందుకే, ఇప్పుడు అలా అనిపించిన‌ప్పుడల్లా నెలా, రెండు నెల‌లు బ్రేక్ తీసుకొని ఇంకో ప్రాజెక్ట్​కు సైన్​ చేస్తున్నా. నాకు, ఆడియెన్స్​కి... ఇద్దరికీ బోర్ కొట్టకూడ‌దు. అందుకే, నా ద‌గ్గరికి వ‌చ్చే స్క్రిప్ట్​లో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెతుకుతున్నా. రియలిస్టిక్ క‌థ‌ల‌ను మాత్రమే ఎంచుకుంటున్నా.  

స్ట్రెస్ అనిపించ‌దు

వ‌ర్క్ విష‌యంలో నాకు ఎలాంటి స్ట్రెస్ అనిపించ‌దు. నాకున్న ఒకే ఒక స్ట్రెస్... నిద్ర. ఎనిమిది గంట‌ల నిద్రపోకపోతే స్ట్రెస్​ అనిపిస్తుంది. కానీ, షూటింగ్స్​ వ‌ల్ల నాకు కావాల్సినంత నిద్ర దొర‌క‌ట్లేదు. పొద్దున పూట తొంద‌ర‌గా నిద్ర లేస్తే ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది. నాకు రెస్ట్ ఎక్కువ కావాలి. నిద్ర స‌రిగా పోక‌పోవ‌డం వ‌ల్ల ఒక్కోసారి చిరాకు పడుతుంటా. నాకు ట్రావెలింగ్, తినడం అంటే ఇష్టం. సినిమాల ద్వారా ట్రావెల్ చేసే అవ‌కాశం వ‌స్తోంది.

లేదంటే, నాకు ఎలాంటి మోటివేష‌న్ దొరికేది కాదు. ఇప్పుడు నేను స్క్రిప్ట్ చూసే కోణం కూడా మారింది. రైటింగ్ స‌రిగా లేకపోయినా, ఎగ్జయిటింగ్​గా అనిపించకపోయినా ఆ ప్రాజెక్ట్​ ఒప్పుకోవ‌డం లేదు. డైరెక్టర్ ఇంటెన్షన్, క‌థలో ఉండే మెసేజ్, సెన్సిటివిటీని బ‌ట్టి స్క్రిప్ట్ సెలెక్ట్​ చేసుకుంటున్నా.

దూరంగా ఉంటా..

సిటీకి దూరంగా ఉంటా. పార్టీలకి వెళ్లను. కెరీర్ మొద‌ట్లో నెట్​వ‌ర్క్ పెంచుకోవాలనే ఉద్దేశంతో పార్టీల‌కు బ‌ల‌వంతంగా వెళ్లేవాడిని. అప్పుడు ఎవ‌రు ఇన్వైట్ చేస్తారా? అని ఫోన్ కాల్స్ కోసం వేచి చూసేవాడిని. కానీ, ఇప్పుడు ఎలాంటి నెట్​వర్క్​ లేకుండానే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి, నాకు న‌చ్చిన‌ట్టుగా సైలెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. నా ప‌ని నేను చేస్తున్నా. నా చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించ‌డం లేదు.
నా పాత్రల గురించి కూడా ఆందోళ‌న పడటం లేదు. వాటిని ఆడియెన్స్​కి వదిలేస్తా. ఒక యాక్టర్​గా ఎప్పటిక‌ప్పుడు న‌న్ను నేను ఇంప్రూవ్ చేసుకోవ‌డానికి నా చుట్టూ ఏం జ‌రుగుతుందనే దానిమీద దృష్టి పెడతా. మ‌నుషులు ఎలా న‌డుస్తున్నారు? వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? వంటి విష‌యాల్ని గమనిస్తుంటా. ఇలాంటి అబ్జర్వేషన్స్​ మా న‌ట‌న‌లో కొత్తదనం తీసుకొచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. - గుణ